మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇటీవల సోషల్ మీడియాలో కొందరు యువకులు చేసిన వివాదాస్పద పోస్ట్‌లకు వ్యతిరేకంగా నిరసనకారులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పదుల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. బంద్ పిలుపును ఉపసంహరించుకోవాలన్న పోలీసుల సూచనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఐదుగురికి మించి ఒకచోట ఉండకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 19 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించారు. అయినప్పటికీ.. పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ఇదీ జరిగింది
ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం తమ వాట్సాప్‌లో వివాదాస్పద పోస్ట్‌లు చేశారు. ఫలితంగా వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నిరసనకారులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటల సమయంలో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. ఈ ఆందోళన వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బంద్‌ను ఉపసహరించుకోవాలని పోలీసులు విన్నవించినా.. ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
కొన్ని సంస్థలు బుధవారం కొల్హాపుర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు శివాజీ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వెనుతిరుగుతుండగా.. కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. నిరసనకారులు.. వారి ఆందోళనలను విరమించుకుని శాంతియుతంగా ఉండాలి.
--మహేంద్ర పండిత్, కొల్హాపుర్ ఎస్పీ
"రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం"
--ఏక్నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
మరోవైపు మహారాష్ట్రలో ఔరంగజేబ్‌ను కీర్తించే వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. అదే సమయంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖకు సూచించారు.