అసోంలోని శివసాగర్ జిల్లాలో ఏప్రిల్ 21న అపహరణకు గురైన ఓఎన్జీసీ అధికారి రితుల్ సైక్యాను శనివారం ఉదయం విడుదల చేసింది ఉల్ఫా ఉగ్రవాద సంస్థ. ఏప్రిల్ 21న మొత్తం ముగ్గురు ఓఎన్జీసీ అధికారులను ఉల్ఫా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అయితే ఇద్దరిని ఏప్రిల్ 24న కాపాడారు పోలీసులు. సైక్యాను.. మయన్మార్ సరిహద్దు వద్ద వదిలిపెట్టగా.. 40 నిమిషాల పాటు నడిచి భారత సరిహద్దులోకి వచ్చాడు.
శనివారం ఉదయం 7 గంటలకు.. మయన్మార్ సరిహద్దులో సైక్యాను విడిచిపెట్టారు ఉగ్రవాదులు. సైక్యా.. భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత నాగాలాండ్ పోలీసులు అతన్ని మోన్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు విచారించి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు.
'షా'కు కృతజ్ఞతలు..
ఓఎన్జీసీ అధికారిని విడుదల చేయటంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిఒక్కరి సహకారంతో రాష్ట్రంలో శాంతి నెలకొందని, అభివృద్ధి జరిగిందన్నారు.
" ఓఎన్జీసీ అధికారి రితుల్ సైక్యాకు హృదయపూర్వక స్వాగతం. ఈ సందర్భంగా అనుక్షణం దిశానిర్దేశం చేసిన గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు. ప్రతిఒక్కరి సహకారంతోనే రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరిగింది."
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
ఏప్రిల్ 21న.. ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు అధికారులను.. అసోం-నాగాలాండ్‌లోని శివసాగర్ జిల్లాలో ఉల్ఫా(ఐ) ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది.
ఇదీ చదవండి : ముగ్గురు ఓఎన్జీసీ అధికారుల అపహరణ