చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత ప్రభుత్వం నిద్ర పోతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లో సైనికులు దెబ్బలు కాస్తున్నారంటూ భారత ఆర్మీ నైతికతను దెబ్బతీసేలా వ్యవహరించిన రాహుల్‌ను పార్టీ నుంచి తొలగించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డిమాండ్ చేసింది. ఈ మేరకు భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విలేకరులతో మాట్లాడారు.
మల్లికార్జున ఖర్గే నిజంగా రిమోట్ కంట్రోల్డ్ అధ్యక్షుడు కాకపోతే.. వెంటనే రాహుల్‌ను పార్టీ నుంచి తొలగించాలని భాటియా డిమాండ్ చేశారు. విపక్ష పార్టీ దేశం పక్షాన ఉంటే వెంటనే పార్టీ నుంచి రాహుల్‌ను బహిష్కరించాలన్నారు. ఒకవేళ రాహుల్ గాంధీని తొలగించకపోతే ఆయనే పార్టీని ముందుండి నడిపిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ అడ్డాగా మారిందని దుయ్యబట్టారు.
రాహుల్‌తో దేశానికే ఇబ్బంది
రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు సైతం విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వల్ల దేశం పరువుపోతోందని ట్వీట్ చేశారు. ఆయనతో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు.. దేశం మొత్తానికీ ఇబ్బంది అని వ్యాఖ్యానించారు.
ఇంతకీ రాహుల్ ఏమన్నారు?
పొరుగు దేశం చైనా మనపై యుద్ధానికి సిద్ధమవుతుంటే.. కేంద్రం నిద్రపోతోందంటూ రాహుల్ గాంధీ అన్నారు. చైనా గురించి ఇదే విషయాన్ని తాను గడిచిన రెండేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చైనా చొరబాట్లకు పాల్పడటం లేదు, యుద్ధానికి సన్నద్ధమవుతోందని.. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదని చెప్పారు. భారత్ జోడో యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.