Khammam Politics Telangana Assembly Elections 2023 : సమఉజ్జీల సమరంతో ఉద్యమాల గుమ్మం ఖమ్మం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay Kumar) మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. అనూహ్యంగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరావు బరిలో దిగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ దిగ్గజాలైన పువ్వాడ-తుమ్మల ప్రచార వ్యూహాల్లో నువ్వా నేనా అంటూ ఒకరిపై ఒకరు విమర్శానాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.
ఇక వారం రోజులే గడువు - ఓటర్లను పేరు పేరునా పలకరిస్తున్న నాయకులు
కళ్ల ముందు ఉన్న అభివృద్ధిని పువ్వాడ అజయ్ ప్రస్తావిస్తుంటే అసలు స్తంభాంద్రికి ప్రగతి రుచి చూపిందే తానంటూ తుమ్మల చెప్పుకుంటున్నారు. సీపీఎం నుంచి ఎర్ర శ్రీకాంత్, జనసేన తరఫున మిరియాల రామకృష్ణ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014లో తెలుగుదేశం(TDP) తరఫున తుమ్మల బరిలో నిలవగా.. కాంగ్రెస్ నుంచి పువ్వాడ పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ఆధిపత్యం చలాయించారు. తర్వాత ఇద్దరూ ఒకే పార్టీలోకి వచ్చారు.
పువ్వాడ-తుమ్మల పోటీతో ఖమ్మంలో రాజకీయ కాక : ఎమ్మెల్సీగా తుమ్మలకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. వెనువెంటనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పాలేరు ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ గెలిచారు. 2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ రెండోసారి ఖమ్మం నుంచి విజయబావుటా ఎగురవేశారు. రాష్ట్ర మంత్రిగా పదోన్నతి పొందారు. అదే ఎన్నికల్లో పాలేరులో నిలబడ్డ తుమ్మల అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇటీవల కాంగ్రెస్‌లో(Congress Party) చేరిన తుమ్మల నాగేశ్వరరావు రెండోసారి ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.
ఖమ్మంలో అసెంబ్లీ సమరోత్సాం - మళ్లీ సత్తాచాటే లక్ష్యంతో ముందుకెళ్తున్న కమ్యూనిస్టులు
ఇరువురు తమదైన శైలిలో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పువ్వాడ అజయ్ క్షేత్రస్థాయిలో ప్రచారపర్వాన్ని మరింత ముమ్మరం చేశారు. డివిజన్ల వారీగా ఇంటింటి ప్రచారంతో పాటు ముఖ్యనేతలను బూత్‌స్థాయిలో మోహరించారు. తన రాజకీయ చాణక్యంతో బీఆర్ఎస్కి చెందిన కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులను కాంగ్రెస్‌లో చేర్చుకుని అధికార పార్టీకి తుమ్మల ఝలక్ ఇచ్చారు. గెలుపు ఓటములపై ప్రభావం చూపే కమ్మ సామాజిక వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇద్దరు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఖమ్మం అసెంబ్లీపోరులో రసవత్తర రాజకీయం : ముస్లిం, ఇతర సామాజికవర్గాలను(Social Groups) ఆకర్షించేందుకు పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తుమ్మల-పువ్వాడ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తున్న తాను మళ్లీ తుమ్మలను ఓడిస్తానని మంత్రి పువ్వాడ చెబుతున్నారు. ఖమ్మం అభివృద్ధికి తానే పునాదులు వేశానని చెప్పుకుంటూనే.. ప్రస్తుత అరాచక పాలనకు చరమగీతం పాడతానంటూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. అంగ అర్థ బలంతో పాటు, పోల్ మేనేజ్‌మెంట్‌లో దిట్ట కావడం పువ్వాడ అజయ్‌కు కలిసొచ్చే అంశం.
ఖమ్మంలో దొంగ ఓట్ల వ్యవహారం - తుమ్మల, పువ్వాడ మధ్య మాటల తూటాలు
Congress Election Campaign in Khammam : కాంగ్రెస్‌కు చెక్కుచెదరని సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు చేరికలతో తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకెళుతున్నారు. పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం ఈసారి ఎవరి వైపు నిలుస్తుందన్నది ఆసక్తికరం. ఖమ్మంలో బలమైన క్యాడర్ ఆ పార్టీ సొంతం. 24 శాతంగా ఉన్న యువ ఓటర్లు(Young Voters) అభ్యర్థుల తలరాతను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం ఓటర్లు బీఆర్ఎస్ వైపు నిలబడతారా..? కాంగ్రెస్ వెంట ఉంటారా అనేది రసవత్తరంగా మారింది.
ఉమ్మడి ఖమ్మంలో రసవత్తరంగా రాజకీయ 'ఆట' - సై అంటే సై అంటున్న అభ్యర్థులు