Corona cases in India: కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా రోజుకు 50వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. సోమవారం భారీగా తగ్గాయి. మరో 42,154 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,25,669కు చేరింది.
కొత్త కేసులు తగ్గినప్పటికీ.. కొవిడ్ మరణాలు భారీగా నమోదయ్యాయి. సోమవారం 729 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాలు సంఖ్య 54,395కు చేరింది. అయితే.. ఇందులో సవరించిన మార్గదర్శకాల ప్రకారం 638 మరణాలు చేరినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో మరో 24వేల కేసులు
కర్ణాటకలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం కొత్తగా 24,172 మందికి వైరస్ సోకింది. 56 మంది మరణించారు. 30,869 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 17.11 శాతంగా ఉంది.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం కొత్తగా 15,140 మందికి వైరస్ సోకింది. ఆదివారంతో పోలిస్తే 7,304 కేసులు తక్కువగా నమోదయ్యాయి. మరో 39 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,21,109కు చేరింది. రాష్ట్రంలో మరో 91 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
బంగాల్లో తెరుచుకోనున్న విద్యాసంస్థలు
బంగాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలను తెరవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 3 నుంచి పాఠశాలల్లో 8-12 తరగతులు సహా కళాశాలలు తెరుచుకోనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే.. దిల్లీ నుంచి ముంబయికి రోజువారీ విమానాలకు అనుమతించారు. మరోవైపు.. యూకే నుంచి కోల్‌కతాకు విమానాలను అనుమతించినప్పటికీ ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరిక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. కార్యాలయాల్లో 75 శాతం సిబ్బందితో విధులు నిర్వర్తించేందుకు ఓకే చెప్పారు. రాత్రి కర్ఫ్యూ సమయాలను తగ్గించారు.
మధ్యప్రదేశ్‌లోనూ..
ఫిబ్రవరి 1 నుంచి 1వ తరగతి నుంచి 12 వరకు పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 50 శాతం సామర్థ్యంతో పాఠశాలలు తెరుస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వివిధ రాష్ట్రాలు
రాష్ట్రం | కొత్త కేసులు | మరణాలు |
తమిళనాడు | 19,280 | 20 |
మధ్యప్రదేశ్ | 8,062 | 2 |
గుజరాత్ | 6,679 | 35 |
ఆంధ్రప్రదేశ్ | 5,879 | 9 |
ఒడిశా | 3,329 | 18 |
తెలంగాణ | 2,861 | 3 |
దిల్లీ | 2,779 | 38 |
ఛత్తీస్‌గఢ్ | 2,693 | 19 |
బంగాల్ | 1,910 | 36 |
హిమాచల్‌ప్రదేశ్ | 1,471 | 5 |
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం- ఆందోళనకరంగా మరణాలు