కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగాయి. కూట్టిక్కల్లో కొండచరియలు విరిగిపడగా.. నలుగురు చనిపోయారు. మరో 9 మంది గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురు బలయ్యారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. తిరువనంతపురంలో పలు రహదారులు జలమయం కాగా.. ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల తెన్‌మల డ్యాం గేట్లను అధికారులు ఎత్తివేయగా.. సమీపంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
అటు పథనంతిట్ట జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉండగా ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అక్కడి పరిస్థితులను సమీక్షించారు. మరోవైపు జిల్లాలోని అనతోడు, కక్కి డ్యాంల నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుండటం వల్ల అధికారులు గేట్లు ఎత్తివేశారు. డ్యాం పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అలప్పుజా, ఇడుక్కి, కుట్టనాడ్‌లనూ భారీ వర్షాలు కుదిపేయగా ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు జలమయంగా మారాయి.
ఇవీ చదవండి: