వారంతా రిక్షా కార్మికులు.. అయితేనేం విదేశీయులకే గైడ్లుగా వ్యవహరిస్తారు. బడికి వెళ్లలేదు.. కానీ, ఇంగ్లిష్ మాత్రం ఇరగదీస్తారు. మరికొన్ని విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడతారు. పరదేశీయులకు ప్రకృతి అందాలను, పక్షుల సొగసులను చూపిస్తారు. వాటి విశేషాల్ని వివరిస్తారు. వారే రాజస్థాన్‌లోని ఓ నేషనల్ పార్కులో ఉపాధి పొందే రిక్షా కార్మికులు.
కెవలాదేవ్ నేషనల్ పార్కు.. భరత్‌పుర్ జిల్లాలో ఉంది. ఏటా ఈ పార్కుకు దాదాపు 370 రకాల పక్షులు వేల సంఖ్యలో వలస వస్తాయి. వీటిని చూడడానికి రోజూ వందల సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. అయితే ఈ పార్కులో సొంత వాహనాల్లో తిరగడానికి అనుమతి ఉండదు. రిక్షాలో మాత్రమే వెళ్లాలి. ఇందుకోసం పార్కులోనే 150 మంది రిక్షా కార్మికులు ఉంటారు. వీరంతా పర్యటకులను రిక్షాలో ఎక్కించుకుని పార్కునంతా చూపిస్తారు. పార్కులో ఉండే విశేషాలను వారి భాషలోనే వివరిస్తారు. ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, డచ్, వంటి భాషలను సులభంగా మాట్లాడుతున్నారు. పర్యటకులు గైడ్‌లను వెంట తెచ్చుకోని సందర్భాల్లో రిక్షా కార్మికులే వారికి గైడ్లుగా వ్యవహరిస్తారు.
1993 నుంటి ఈ పార్కులో రిక్షా నడుపుతున్నాను. అనేక యూరోపియన్ భాషలు నాకు తెలుసు. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మొదలైన దేశాల నుంచి వచ్చే పర్యటకులకు వారి భాషల్లోనే పక్షుల గురించి సమాచారం ఇస్తాను.
-జస్వంత్ సింగ్, రిక్షా కార్మికుడు
కొన్ని సంవత్సరాల క్రితం పార్క్ నిర్వహకులు ప్రత్యేకంగా ఫ్రెంచ్ భాష శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా టూరిస్ట్ గైడ్లు, రిక్షా కార్మికులకు ఫ్రెంచ్ భాషపై అవగాహన ఏర్పడింది. ఫలితంగా ఈ పార్కుకు వలస వచ్చే అన్ని రకాల పక్షుల గురించి పర్యటకులకు సులభంగా చెప్పగలుగుతున్నారు రిక్షా కార్మికులు.
ఇవీ చదవండి:
రన్నింగ్ ట్రైన్ ట్యాంకర్ల నుంచి రూ.లక్షలు విలువైన ఆయిల్ చోరీ