దిల్లీ ప్రభుత్వంలోని కీలక మంత్రులైన ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ల రాజీనామాలతో మంత్రివర్గంలో ఖాళీ అయిన పలు శాఖల బాధ్యతలను అప్పగించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలను ఎంపిక చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎమ్మెల్యేలు అతిషీ, సౌరభ్ భరద్వాజ్ పేర్లను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సిఫార్సు చేశారు. ఈ మేరకు లేఖ రాశారు దిల్లీ సీఎం. వీరిద్దరినీ కేబినెట్లోకి తీసుకునేందుకు సంబంధించిన ముసాయిదాను బుధవారం ఉదయం గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ రాజీనామాలను గవర్నర్ వీకే సక్సేనా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. రాజీనామాలను ఆమోదించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఖాళీ అయిన శాఖల మంత్రులుగా ఎంపికైన సౌరభ్ భరద్వాజ్ దిల్లీలోని గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఈయన దిల్లీ జల్ బోర్డుకు వైస్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక అతిషి కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు మంత్రుల రాజీనామాతో ఈ ఇద్దరు ఎమ్మల్యేలకు దిల్లీ మంత్రివర్గంలో మంత్రులుగా పదోన్నతి కల్పించారు.
18 శాఖలకు బాధ్యతలు వహించిన సిసోదియా, మనీలాండరింగ్ కేసులో నెలల తరబడి జైలులో ఉన్న జైన్‌లు తమ మంత్రి పదవుల నుంచి వైదొలగడం వల్ల మంత్రివర్గ కూర్పు అనివార్యమైంది. మంగళవారం సిసోదియా రాజీనామా ప్రకటన అనంతరం ఆయన వద్ద ఉన్న శాఖలను ఆప్ సీనియర్ నేతలు కైలాష్ గహ్లోత్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం సాగినా.. చివరకు ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషికి బాధ్యతలను అప్పజెప్పాలని నిర్ణయిస్తూ గవర్నర్‌కు సిఫార్సు చేశారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్.
2021-22 దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రూపకల్పన, అమలు కేసులో సిసోదియాను ఈ నెల 26న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ మంగళవారం సిసోదియా సుప్రీంను ఆశ్రయించగా.. ఆయన బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. దీనిని దిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అంతకుముందు అరెస్టు తర్వాత సిసోదియాను సోమవారం దిల్లీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ.. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరింది. ఈ మేరకు న్యాయస్థానం ఈ నెల 4 వరకు సిసోదియాకు రిమాండ్ విధించింది. ఇప్పటికే తిహాడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న జైన్‌ను గతేడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దిల్లీ మద్యం స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది.