KCR Fires on Central Government: ఈ దేశంలో సమృద్ధిగా నీటి వనరులు ఉన్నాయని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పేర్కొన్నారు. సాగు యోగ్యత ఉన్న భూములకు నీరు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పని చేసే సామర్థ్యాలు లేవని విమర్శించారు. నిజాయతీగా మేం చేసే పోరాటానికి విజయం తథ్యమని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నీరు అందిస్తామని చెప్పారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో ఐదేళ్లలోపు ప్రతి ఇంటికి నీరిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగదని వివరించారు. నిజాయతీగా పోరాడతామని...అంతిమ విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు రోజుకు 3 గంటలే కరెంటు ఉండేదని.. అదీ నమ్మకం లేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో 24 గంటలు సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక్క నిమిషం సీఎం పదవిలో ఉండను: ఉచిత విద్యుత్ పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేయవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కొత్త లక్ష్యాలు.. సంకల్పంతో ముందుకెళ్లాలని వివరించారు. దేశంలో 24 గంటలు విద్యుత్ సరఫరా అందించే వనరులు ఉన్నాయని.. సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని.. ఇది అబద్ధమైతే తాను ఒక్క నిమిషం సీఎం పదవిలో ఉండనని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ తరహా పథకాలు రావట్లేదు: కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తాము వచ్చాక వాటిని తిరిగి ప్రభుత్వపరం చేస్తామని పేర్కొన్నారు. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకుందామని అన్నారు. మహారాష్ట్రలో వనరులు ఉన్నాయని.. పాలనా సామర్థ్యం ఉన్న అధికారులు ఉన్నారని వివరించారు. ఇక్కడ ఎందుకు తెలంగాణ తరహా పథకాలు రావట్లేదని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త చట్టాలు అవసరమని వెల్లడించారు. అంతకు ముందు కేసీఆర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ విమానాశ్రయం నుంచి నేరుగా మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ నివాసానికి వెళ్లారు. గతంలో ఆయన వైజాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
"జింబాబ్వే వంటి చిన్న దేశాల్లో పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. రైతులు ఆలోచన చేయాలి.. ఐక్యంగా ఉండండి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలి. ఇక్కడి పాలకులు కచ్చితంగా దిగి వస్తారు.. మీ సమస్యలు తీరుతాయి. తెలంగాణలో అమలు చేస్తున్న ప్రతి పథకం ఇక్కడ అమలుచేస్తే ఇక్కణ్నుంచి వెళ్తా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించండి. ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారం కావో చూస్తా. ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత నాది. ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదు. రైతులంతా ఐక్యంగా కదిలి మీ రాజ్యం తెచ్చుకోవాలి" -కేసీఆర్, సీఎం
ఇవీ చదవండి: KCR Interesting Comments: మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు: కేసీఆర్
'బీజేపీ దేశానికి చేసిందేమి లేదు.. కేవలం ప్రచారమే చేసుకుంది'.. మమతతో నీతీశ్ భేటీ