జమ్ముకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలో సంజయ్ శర్మ(40) అనే కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన కశ్మీరీ పండిట్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అచన్‌లోని స్థానిక మార్కెట్‌కు సమీపంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
ఉగ్రవాద కాల్పుల్లో గాయపడ్డ కశ్మీరీ పండిట్ సంజయ్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని పోలీసులు చెప్పారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని.. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇంటి గార్డెన్లో పండిట్ హత్య..
గతేడాది అక్టోబరు 15న షోపియాన్ జిల్లాలో.. ఓ కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో పురన్ కృష్ణన్ భట్ అనే పండిట్ మరణించారు. కృష్ణన్ భట్ ఇంటి గార్డెన్ సమీపంలోనే ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. స్థానికులు కృష్ణన్ భట్‌ను షోపియాన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
కశ్మీరీ పండిట్ కృష్ణన్ భట్‌పై దాడి తమ పనేనని కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ప్రకటించిందని పోలీసులు తెలిపారు. ఎందుకు హత్య చేశారనే విషయంపై మాత్రం వెల్లడించలేదని పేర్కొన్నారు. 'బాధితుడు స్కూటర్‌పై బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. అతడు ఒంటరిగా లేడు. ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు. ఒక్కడే వచ్చి దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న గార్డు సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం' అని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
కశ్మీరీ పండిట్ హత్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో న్యాయం జరగకపోతే టార్గెట్ హత్యలు ఆగవని ఆయన తెలిపారు. కశ్మీరీ పండిట్ కృష్ణన్ భట్ హత్యకు ఆర్టికల్ 370 తొలగింపే ఓ రకంగా కారణమని పేర్కొన్నారు.