Kashmir Migrant Family Relief Fund Increase : కశ్మీరీ వలస కుటుంబాల కోసం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో నివసించే కశ్మీరీ వలస కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కశ్మీరీ కుటుంబాలకు ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తుండగా.. ఇప్పుడు దాన్ని రూ.27 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజ్‌నివాస్ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద బాధిత కశ్మీరీ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ సాయం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ భద్రతా సంబంధిత వ్యయం పథకం కింద ఈ నగదును అందజేస్తున్నారు.
అడ్ హక్ మంత్లీ రిలీఫ్- AMR ప్యాకేజీ కింద కశ్మీరీ వలస కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఏఎంఆర్ కింద వలస కుటుంబాలకు 1995లో రూ.5వేలు ఆర్థిక సాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత 2007లో దాన్ని రెట్టింపు చేశారు. అయితే ఏఎంఆర్‌కు అర్హులైన కుటుంబ సభ్యుల డేటా తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలని అధికారులు తెలిపారు. ఈ రిలీఫ్ మొత్తాన్ని ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లిస్తున్నట్టు చెప్పారు. దిల్లీ నగరంలో ప్రస్తుతం దాదాపు 2వేల కుటుంబాలు ఈ రిలీఫ్‌ను పొందుతున్నాయి.
ఆ గ్రామానికి ఈటీవీ భారత్!
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కశ్మీరీ పండిట్ల ఊచకోత జరిగిన ఒక గ్రామాన్ని ఈటీవీ భారత్ కొన్ని నెలల క్రితం సందర్శించింది. పుల్వామా జిల్లా షోపియాన్‌కు సమీపంలోని నడిమార్గ్ గ్రామంలో 2003 మార్చి 23న రాత్రి 11గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 24 మంది కశ్మీరీ పండిట్లను విచక్షణారహితంగా తుపాకీతో కాల్చిచంపారు. వారిలో 11మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 65ఏళ్ల వృద్ధులు మొదలుకొని రెండేళ్ల చిన్నారులు ఉన్నారు. ఎంపిక చేసిన కశ్మీరీ పండిట్లను ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి.. వరుసగా నిలబెట్టి ఉగ్రవాదులు కిరాతంగా కాల్చిచంపారు. కొంతమంది స్థానికులు కూడా ఉగ్రవాదులకు సహకరించారు. మృతదేహాలను గుర్తు పట్టనంత దారుణంగా ఛిద్రం చేసిన ముష్కరులు కశ్మీరీ పండిట్ల ఇళ్లను లూఠీ చేశారు. చివరకు మహిళల మృతదేహాలపై ఉన్న ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారు.
ఈ ఘటన జరిగి రెండు దశాబ్దాలకు పైగా గడిచింది. ఆ మారణకాండతో హడలిపోయిన కశ్మీరీ కుటుంబాలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కశ్మీర్‌ను వీడిపోయాయి. సొంత ఇళ్లు, భూములు, ఆస్తిపాస్తులన్నీ వదులుకొని నిరాశ్రయులుగా ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డాయి. ఆనాటి దుర్ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆ పాత రోజులు రావాలని కోరుతున్నారు.