Kashmir encounter: ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన వరుస ఉగ్రవాద దాడులు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో ముష్కరుల దాడులకు ఓ కానిస్టేబుల్, టీవీ నటి బలయ్యారు. ఈ నేపథ్యంలో ఉగ్రమూకలను కట్టడి చేసే చర్యలను ముమ్మరం చేసిన భద్రతా సిబ్బంది.. గురువారం జరిపిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు తీవ్రవాదలను మట్టుబెట్టారు. వీరిలో టీవీ నటి హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని గుర్తించారు.
"పుల్వామా జిల్లా అవంతీపుర ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో టీవీ నటి అమ్రీన్ భట్ హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వీరిలో ఒకరు బుద్గామ్కు చెందిన షాహిద్ ముస్తక్ భట్కాగా మరొకరు పుల్వామాకు చెందిన ఫర్హాన్ హబీబ్. అమ్రీన్‌ను హత్య చేసిన వీరు ఇటీవల ఉగ్రవాద సంస్థలో చేరారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాము."
-పోలీసులు
శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటివరకు ఉగ్రవాద కట్టడి చర్యల్లో భాగంగా మూడు రోజుల వ్యవధిలో 10 మంది ముష్కరులను మట్టుబెట్టారు పోలీసులు. వీరిలో ఏడుగురు లష్కరే తోయిబాకు చెందినవారు కాగా ముగ్గురు జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారు.
ఇదీ చూడండి : కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఏడెళ్ల కుమార్తెపైనా...