జమ్ముకశ్మీర్‌లోని బద్గాం.. దేశంలోనే ఏకైక క్షయ రహిత జిల్లాగా నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 65 జిల్లాలు.. టీబీ రహిత ప్రాంతాల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేయగా.. వాటిల్లో బద్గాం తన మెరుగైన పనితీరుతో అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుద్గాం జిల్లా గత ఐదేళ్లో కనబరిచిన పనితీరుకు స్వర్ణ పతకం అందించింది.
ఈ అవార్డు అందుకున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు ఆ జిల్లా టీబీ నివారణ అధికారిణి డాక్టర్ అద్ఫార్ యాసీన్. "ఈ మైలు రాయిని చేరుకున్నందుకు గర్వంగా ఉంది. గత ఐదేళ్లుగా మా బృందం ఎంతో శ్రమ పడింది. చివరకు విజయం సాధించాం. అందుకు తగిన గుర్తింపు లభించింది" అని అధ్పార్ అన్నారు. టీబీపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
60శాతం తగ్గిస్తే.. స్వర్ణం
2025 నాటికి భారత్‌ను క్షయ రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో ప్రచారం ముమ్మరం చేసింది కేంద్రం. దీనిలో భాగంగా క్షేత్ర స్థాయిలో క్షయ వ్యాధిపై అవగాహన ప్రచారాన్ని వేగవంతం చేయాలని అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏ జిల్లా అయిన ఐదేళ్లలో క్షయ వ్యాధిని 60 శాతం తగ్గిస్తే.. స్వర్ణ పతకాన్ని, 40 శాతం తగ్గిస్తే కాంస్యం, 20 శాతం అయితే రజతాన్ని అందిస్తున్నారు.
ఇదీ చూడండి: హోలీ వేళ మోదీ మాస్క్‌లకు భలే గిరాకీ