ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ల ప్రభావం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందని కర్ణాటకకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ వి.రవి పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు రాకపోతే టీకాల ప్రభావం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న డా.రవి ఓ అసోసియేషన్ నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రస్తుతమున్న టీకాలు కనీసం సంవత్సరం పాటు రక్షణ ఇవ్వగలవు. కొత్త వేరియంట్ల ప్రభావం లేకపోతే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు రక్షణగా ఉంటాయి" అని తెలిపారు. వ్యాక్సిన్ల ప్రభావంపై కచ్చితమైన వ్యవధిని నిర్ణయించేందుకు మరింత పరిశోధన అవసరమన్నారు.
మూడో దశ అనివార్యం..
దేశంలో మూడో దశ అనివార్యమని.. అందుకు సిద్ధంగా ఉండాలని డా.రవి హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌లను ముందే గుర్తించాల్సిన అవసముందని నొక్కి చెప్పారు. "భారతీయులకు రోగనిరోధక శక్తి అధికమని, భారత్‌లో రెండో దశ రాదని చాలా మంది భావించారు. కానీ దేశంలో రెండో దశ ఎంత విలయం సృష్టింస్తోందో చూస్తున్నాం. దేశంలో మూడో దశ అనివార్యమే. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. కొన్ని యురోపియన్ దేశాల్లో వైరస్ మూడో దశ కొనసాగుతోంది. అమెరికాలో నాలుగో దశ ప్రారంభమైంది" అని వెల్లడించారు.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మే మొదటి వారంలో 4 లక్షలకు పైగానే కేసులు నమోదవగా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధింపుతో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,65,553 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల్లో మాత్రం అంతగా తగ్గుదల కనిపించడం లేదు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,460 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి: Vaccination: టీకా తీసుకున్నవారి నుంచి వైరస్ రాదా?