అసలే తక్కువ జీతంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అతడిని కరోనా మరో దెబ్బతీసింది. జీతం మరింత తగ్గింది. ఇంటి అద్దె, బిడ్డల చదువులు, నిత్యవసరాలు కొనేందుకు చాలీచాలని డబ్బు. ఏం చేయాలో తెలియలేదతనికి. కిడ్నీ అమ్మకానికి పెట్టాడు. తన గోడును ఫేస్బుక్ వేదికగా వెళ్లబోసుకున్నాడు కర్ణాటక కొప్పల్కు చెందిన బస్ కండక్టర్గా పనిచేసే హనుమంత్ కాలేగర్.
''నేను రవాణా ఉద్యోగిని. ఇంటి అద్దెకు, నిత్యవసరాలకూ నా దగ్గర డబ్బు లేదు. అందుకే నేను కిడ్నీ అమ్మకానికి పెడుతున్నా. ఇది నా ఫోన్ నంబర్.''
- హనుమంత్ కాలేగర్, బస్ కండక్టర్
ఈశాన్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(ఎన్ఈకేఆర్టీసీ)కి చెందిన గంగావతీ డిపోలో పనిచేస్తున్నాడు హనుమంత్. అంతకుముందు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేసినా.. ఆర్థిక సమస్యలు తీరలేదని చెప్పుకొచ్చాడు.
కరోనా సంక్షోభంతో తన జీతం మరింత తగ్గిందని.. అది తన జీవనానికి ఎటూ సరిపోట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటి అద్దె, పిల్లల చదువులతో పాటు.. తన తల్లిదండ్రుల వైద్య ఖర్చులు భరించడం భారమైందని చెబుతున్నాడు. ఇకే చేసేదేం లేక మూత్రపిండం అమ్మాలని నిర్ణయించుకున్నట్లు విలేకర్లకు వెల్లడించాడు.
అలా అయితే కష్టం!
తక్కువ వేతనం కారణంగా.. ప్రస్తుతం హనుమంత్ సరిగా విధులకు కూడా రావట్లేదని చెప్పారు ఎన్ఈకేఆర్టీసీ కొప్పల్ డివిజన్ మేనేజర్. ఇక ముందు కూడా సక్రమంగా హాజరుకాకుంటే పరిస్థితి మెరుగుపడదని అతని కుటుంబసభ్యులకు చెప్పినట్లు వివరించారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాలపై 2024 వరకు ఉద్యమం!'