కర్ణాటకలోని కొప్పల్‌కు చెందిన బాలేశ విశ్వనాథ్ హిరేమట్ 8వ తరగతి చదువుతున్నాడు. గతేడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా.. దేశంలో అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేయడానికి ఇష్టపడే విశ్వనాథ్.. బడిలేనందున వ్యర్థాలతో వస్తువుల తయారీకి పూనుకున్నాడు. ఏకంగా విద్యుత్‌తో నడిచే ద్విచక్రవాహనాన్ని తయారు చేశాడు.
ఆలోచనకు సృజనాత్మకత తోడై..
ఎలక్ట్రిక్ బైక్‌ని తయారు చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి.. అందుకు అవసరమైన విడిభాగాలను సేకరించే పనిలో పడ్డాడు విశ్వనాథ్. ఎలక్ట్రిక్ వ్యర్థాలు సేకరించే వారి వద్దకు వెళ్లి.. తనకు అవసరమైన వాటిని తీసుకున్నాడు. ఇంట్లో వృథాగా పడి ఉన్న వస్తువులను కూడా బైక్ తయారీకి ఉపయోగించి సృజనాత్మకతో విద్యుత్ ద్విచక్ర వాహనం తయారు చేశాడు.
ఓ సారి ఛార్జింగ్‌తో 50 కి.మీ.
వినూత్నంగా ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ వాహనంలో.. ల్యాప్‌టాప్‌లోని లిథియం బ్యాటరీని ఉపయోగించాడు విశ్వనాథ్. ఆ బ్యాటరీని ఒకసారి ఛార్జ్‌చేస్తే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని విశ్వనాథ్ తెలిపాడు. బైక్‌ని రూపొందించటానికి రూ.9వేల వరకూ ఖర్చు అయినట్టు అతడు చెప్పాడు.
తన కుమారుడు తయారుచేసిన ఈ బైక్‌ను స్థానికులంతా మెచ్చుకుంటున్నారని విశ్వనాథ్ తండ్రి చెప్పారు. కుమారుడి ఆలోచనలను మరింతగా ప్రోత్సహిస్తానని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: 'దేవుడి ఆజ్ఞతోనే మా బామ్మను చంపేశా'