కనిపించకుండా పోయిన రామచిలుక కోసం ఓ కుటుంబం నిరీక్షణ ఫలించింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక దొరకడం వల్ల ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అంతేకాదు రామ చిలుక ఆచూకీ చెప్పిన వ్యక్తికి ముందు ఇస్తామని చెప్పిన సొమ్ము కంటే.. ఎక్కువగానే ఇచ్చి.. పక్షిపై వారి ప్రేమను చాటుకున్నారు.
అసలేం జరిగిందంటే?
కర్ణాటక, తుముకూరు నగరంలోని జయనగర్ ప్రాంతానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి ఆఫ్రికన్ గ్రే రకానికి చెందిన చిలుకను పెంచుకుంటున్నాడు. ఈ నెల 16న అది ఎగిరిపోయింది. ఆ చిలుకను ఆ కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అది కనిపించకుండా పోయిన నేపథ్యంలో.. ఆచూకీ తెలిపిన వారికి నజరానా ప్రకటించారు. అప్పజెప్పిన వారికి రూ.50 వేల నగదు ఇస్తానని ప్రకటించాడు అర్జున్. చుట్టు పక్కల అంతా పోస్టర్లు వేయించాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాడు.
కొన్ని రోజులకు తుమకూరు బందెపాళ్య గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆ చిలుక దొరికింది. వెంటనే ఆ చిలుక యజమాని అర్జున్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పాడు శ్రీనివాస్. అయితే ఆ సమయంలో చిలుక చాలా బలహీనంగా ఉంది. ఈ క్రమంలో శ్రీనివాస్.. ఆ చిలుకకు సపర్యలు చేశాడు. అందుకే ముందు ఇస్తామని చెప్పిన దానికంటే.. రూ.35 వేలు ఎక్కువగా నగదు బహుమతిని శ్రీనివాస్‌కు అందించాడు అర్జున్.
ఇదీ చదవండి: ఆ టీవీ డిబేట్లపై సీజేఐ ఆందోళన.. 'ప్రజాస్వామ్యం రెండడుగులు వెనక్కి'