కర్ణాటకలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో హోం మంత్రి బసవరాజ్ బొమ్మై తన నివాసాన్నే కొవిడ్ కేర్ సెంటర్ (సీసీసీ)గా మార్చారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక మంత్రి తన నివాసాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చినట్లు ఆయన కార్యాలయం పేర్కొంది.
హవేరి జిల్లా షిగ్గావిలో ఉన్న ఈ కేంద్రంలో.. 50 మంది రోగులకు చికిత్స అందిచొచ్చని తెలిపారు. దీనిలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించిన మంత్రి.. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశించారు. అంతేగాక ఈ కేంద్రానికి ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించి.. జిల్లా ఆస్పత్రిపై భారాన్ని తగ్గించే యోచనలో మంత్రి ఉన్నారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా పరివార్ నేత ఎస్ ఆర్ బొమ్మై కుమారుడైన బసవరాజ్ బొమ్మై.. షిగ్గావి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరోవైపు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సావాడి సైతం.. రూ.50 లక్షలు వెచ్చించి బెల్గాం అథాని వద్ద 50 పడకల కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: 8 వేల మంది కరోనా బాధితులు మిస్సింగ్!