కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి పేరు జ్యోతిరాజ్. అయితే చాలా మందికి కోతిరాజ్గా చాలామందికి ఆయన సుపరిచితం. కొండలు, గోడలు.. నిమిషంలోపే చకచకా ఎక్కయేగలడు జ్యోతిరాజ్.
"నా పేరు జ్యోతిరాజ్. అంతా కోతిరాజ్ అని పిలుస్తారు. పెద్ద పెద్ద బండరాళ్లు, గోడలు త్వరత్వరగా ఎక్కేస్తాను. ఏంజెల్ ఫాల్స్ ఎక్కకుండానే తిరిగొచ్చిన తర్వాత.. కుంగిపోయాను. మరో ప్రయత్నం కోసం కఠోరంగా సాధన చేస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, జలపాతాలు ఎక్కి, కర్ణాటకకు గుర్తింపు తేవాలన్నదే నా ఆశయం."
- జ్యోతిరాజ్, మంకీ మ్యాన్
ఏంజెల్ ఎక్కడమే లక్ష్యం..
కోతిరాజ్ నిత్యం కొండలెక్కడం సాధన చేస్తాడు. ప్రపంచంలోనే ఎత్తైన ఏంజెల్ జలపాతం ఎక్కడం ఆయన కల. కరోనా వల్ల ఆ ప్రయత్నాలు తాత్కాలికంగా ఆగాయి. కొండలెక్కడంలో విభిన్న మెళకువలు పాటిస్తూ కర్ణాటక వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జ్యోతిరాజ్. ఎన్నో కొండలు, పర్వతాలు ఎక్కాడు. ఈ నైపుణ్యం తనతోనే అంతమవకూడదని భావిస్తూ, వారాంతాల్లో ఔత్సాహిక యువకులకు శిక్షణనిస్తున్నాడు.
"కోతిరాజ్ సర్ వద్ద 10 ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. సొంత ఖర్చుతోనే మాకు నేర్పిస్తున్నారు. ఏషియన్ ఛాంపియన్షిప్ గేమ్ సహా.. ఎన్నో పోటీల్లో పాల్గొన్నాం. శని, ఆదివారాల్లో నేర్పిస్తారు. ముందు ఎలా ఎక్కాలో ఆయన నేర్పిస్తారు. తర్వాత వ్యాయామం, డిప్స్ లాంటి కసరత్తులు చేస్తాం."
- అర్జున్, విద్యార్థి
ఉచిత శిక్షణ..
సాహసాలతో కన్నడిగుల అభిమానం చూరగొన్న జ్యోతిరాజ్.. 15మంది ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నాడు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న యువకులు పోటీల్లో పాల్గొని, బహుమతులు సైతం గెలుచుకున్నారు. చిత్రదుర్గ కోటలో ప్రతి ఆదివారం జ్యోతిరాజ్ సాహసాలు చేస్తాడు. పర్యటకుల ముందు కోట గోడలు క్షణాల్లో ఎక్కేస్తాడు. ప్రదర్శన ముగిశాక ప్రశంసాపూర్వకంగా కొందరు ఆర్థికసాయం చేస్తారు. ఆ డబ్బుతోనే యువకులకు శిక్షణనిస్తున్నాడు కోతిరాజ్.
"15 మందికి సొంత ఖర్చుతో శిక్షణ ఇస్తున్నాను. చిత్రదుర్గా కోటలో పర్వతారోహణ శిక్షణ కోసం స్పోర్ట్స్ అకాడమీ నిర్మించాలన్నది నా కల. ఈ నైపుణ్యాలు నాకు మాత్రమే పరిమితమవకూడదు."
- జ్యోతిరాజ్, మంకీ మ్యాన్
ఇంత గుర్తింపు వచ్చినా.. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని జ్యోతిరాజ్ వాపోతున్నాడు. అమెరికాకు వెళ్లి, ఏంజెల్ ఫాల్స్ ఎక్కాలన్న తన కల నెరవేరాలంటే చాలా డబ్బు అవసరం. ప్రభుత్వం సాయమందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని చెప్తున్నాడు.
ఇదీ చదవండి: బాలీవుడ్ సినిమాను తలపించేలా.. స్ట్రెచర్‌పైనే ఆ పెళ్లి!