కరెన్సీ నోట్ల కట్టలను నడుముకు చుట్టుకుని, అక్రమంగా నగదును రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బైక్‌పై వెళుతున్న వారిని.. పోలీసులు ఆపి తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది. వారి నుంచి మొత్తం రూ.7.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేస్తుండంగా నిందితులు పట్టుబడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దావణగెరె జిల్లాలో బుధవారం రాత్రి నిందితులు దొరికారని పోలీసులు తెలిపారు. నిందితులను సైఫుల్లా, కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు షిమోగా జిల్లాలోని షికారిపుర్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకుని.. వాటిని సీజ్ చేసినట్లు వారు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
కర్ణాటక ఎన్నికల సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి అక్రమంగా నగదు, మద్యం సరాఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి కూడా న్యామతి తాలూకాలోని జీనహళ్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడికి సైఫుల్లా, కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. వారి ప్రవర్తన అనుమానస్పదంగా ఉన్న కారణంగా పోలీసులు వారిని క్షణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వారి నడుముకు నగదు కట్టలను కట్టుకోవడాన్ని గుర్తించారు. నగదు ఎక్కడిది అని పోలీసులు వారిని ప్రశ్నించగా.. నిందితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆధారాలు సైతం చూపించలేకపోయారు. దీంతో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గురువారం భారీగా నగదు, మద్యం, బంగారం సీజ్..
కర్ణాటకలో గురువారం జరిపిన తనిఖీల్లో.. వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు భారీగానే నగదు, మద్యం, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిప్పాణి, భద్రావతి, గడగ్, నరగుండ్ ప్రాంతాల్లో 4.45 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 62,826 లీటర్ల మద్యాన్ని కూడా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించింది. వీటి విలువ దాదాపు రూ.1.89 కోట్లు ఉంటుందని తెలిపింది.
ధార్వాడ్ నియోజకవర్గంలో 725 గ్రాముల బంగారాన్ని స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ స్వాధీనం చేసుకుందని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.45 లక్షల వరకు ఉంటుందని వివరించారు. అదే విధంగా బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో.. ఓటర్లకు పంచుతున్న రూ.34 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకుంది. బెలగావి జిల్లాలోని ఖానాపూర్ తాలూకాలో రూ.4.61 కోట్ల నగదును సీజ్ చేశారు. వేర్వేరు ఘటనల్లో 395 గ్రాములు, 28 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా రూ.27.38 కోట్ల నగదును, రూ. 26.38 కోట్ల విలువైన మద్యాన్ని, రూ.88 లక్షల డ్రగ్స్‌ను, రూ.9.87 కోట్లు విలువ చేసే బంగారం, రూ.12.49 లక్షల ఇతర వస్తువులను అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మే 10 కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 13న కౌంటింగ్ జరగనుంది.