Eshwarappa Resignation: కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య నేపథ్యంలో.. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రిని కలిసి శుక్రవారం రాజీనామా లేఖను అందించనున్నట్లు శివమొగ్గలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించిన కాంట్రాక్టర్ రెండు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈశ్వరప్ప కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పాటిల్ వార్తా సంస్థలకు మెసేజ్లు పంపించాడు.
ఈ ఘటనపై ఆరోజే స్పందించిన మంత్రి ఈశ్వరప్ప.. తనకు ఏమీ తెలియదని అన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేశారు. కాంట్రాక్టర్ మృతిపై ఆయన కుటుంబం.. మంత్రిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ఈశ్వరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి: మంత్రిపై ఆరోపణలు చేసిన కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి!
'రబ్బర్ స్టాంప్' రాజకీయం! పంజాబ్ అధికారులకు కేజ్రీవాల్ ఆదేశాలా?