కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తాను వైదొలగడంపై యడియూరప్ప స్వయంగా సంకేతాలు ఇస్తున్న వేళ.. ఈ అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. తన ఉద్వాసనపై అధిష్ఠానం నుంచి త్వరలోనే స్పష్టత వస్తుందని, ఏ ఆదేశాలు వచ్చినా పాటిస్తానని యడియూరప్ప ఇప్పటికే ప్రకటించగా.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా దీనికి భిన్నంగా స్పందించారు. యడియూరప్పకు మద్దతుగా మాట్లాడారు నడ్డా. ఆయన సమర్థంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.
"యడియూరప్ప సమర్థంగా పని చేశారు. కర్ణాటక ప్రభుత్వం బాగా పని చేస్తోంది. ఆయన ప్రతి అంశాన్ని తన పద్ధతిలో పరిష్కరిస్తున్నారు. కర్ణాటకలో నాయకత్వ సంక్షోభం ఉందని మీకు(పాత్రికేయులకు) అనిపిస్తుంది. మాకు మాత్రం అలా అనిపించడం లేదు."
- జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు
పార్టీ నేతలతో విందు
యడియూరప్ప సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి సోమవారానికి రెండేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా విధానసభ సమావేశాల హాల్లో పార్టీ నేతలకు విందు ఏర్పాటు చేశారు యడియూరప్ప. రెండు గంటల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన వైదొలుగుతారనే ఊహాగానాల మధ్య ఈ కార్యక్రమం చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: యడ్డీ నిష్క్రమణపై సాయంత్రం స్పష్టత!