Karnataka Assembly Election 2023 : త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. పట్టభద్రులకు నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. డిప్లొమా చదివిన విద్యార్థులకు నెలకు రూ.1,500 చొప్పున రెండేళ్లపాటు అందిస్తామని తెలిపారు. కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి పాల్గొన్నారు. మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పోరాడాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం కర్ణాటకలోని బీజేపీ సర్కారేనని విమర్శించారు. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
అంతకుముందే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. గృహలక్ష్మి అనే పథకం కింద రాష్ట్రంలోని ప్రతి గృహిణికి నెలకు రూ. 2,000 చొప్పున భృతి ఇస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. దీని ద్వారా సుమారు కోటిన్నర మంది గృహిణులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఏడాదికి రూ. 24,000 నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమా అవుతుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా అన్న భాగ్య కింద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.
తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆప్
మరోవైపు, మేలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ మేరకు 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 224 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. ఈ తొలి జాబితాలో సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేశ్ కలప్ప, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారి కే మహాతి సహా పలువురు ప్రముఖులు ఇందులో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన అధ్యక్షుడు పృథ్వీ రెడ్డి.. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించామన్నారు. తాము ప్రకటించిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా మంది 45 ఏళ్లకు తక్కువ ఉన్నవారేనని చెప్పారు. డాక్టర్లు, లాయర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ సహా చాలా వరకు విద్యావంతులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ బంధువు శరత్చంద్రకు సైతం టికెట్ కేటాయించింది ఆప్.
ఇవీ చదవండి : మహిళల కోసం కొత్త ప్రభుత్వ పథకం.. నెలకు వెయ్యి రూపాయల భృతి