కర్ణాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పతాకస్థాయికి చేరుతోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ... ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహా రచన చేస్తున్నాయి. ఈసారి సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థుల మార్పుతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలని భాజపా వ్యూహాలు రచించింది. అందులో భాగంగానే మొత్తం 224 స్థానాల్లోని 72 చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ నిర్ణయం తమకు కలిసివస్తుందని భావిస్తోంది. సీనియర్లకు టికెట్ నిరాకరించిన భాజపా.. అది తమకు లాభిస్తుందని ధీమాగా ఉంది. మే 10న జరిగే పోలింగ్‌లో తొలిసారి బరిలోకి దిగిన అభ్యర్థులు ఎక్కువమంది విజయం సాధిస్తారని భాజపా నమ్ముతోంది.
పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, యువతకు ఈసారి కొత్తగా సీట్లు ఇచ్చామని, ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని భాజపా కర్ణాటక ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ చెబుతున్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందన్న అరుణ్‌సింగ్... పార్టీ కార్యకర్తలకు అవకాశాలు దక్కాల్సిందేనని అన్నారు. కొత్త అభ్యర్థుల ఎంపికతో భాజపాకు చరిత్రాత్మక తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కానీ, సిట్టింగ్ స్థానాల్లోనూ కొత్త అభ్యర్థులను బరిలోకి దింపడం వల్ల భాజపాకు రెబల్స్ బెడద పెరిగింది. చాలా స్థానాల్లో అభ్యర్థులు రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. టికెట్లు దక్కని చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్... హస్తం పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది కూడా భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు. టికెట్లు దక్కని మరికొందరు నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగనుండడం కమలం పార్టీని కలవర పెడుతోంది.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు కమలం పార్టీ టికెట్ నిరాకరించడం... లింగాయత్ వర్గాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అభివర్ణించడం భాజపాను కలవరపరుస్తోంది. ఈ విమర్శలకు తిప్పికొట్టేందుకు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్పతో విస్తృత ప్రచారానికి భాజపా ప్రణాళిక రచించింది. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తాను పర్యటిస్తానని యడియూరప్ప సైతం ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రచారం భాజపాకు లాభిస్తుందని కమలం పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది.
కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు 76, జేడీఎస్‌కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.