Donkey milk farm: అందరికీ విభిన్నంగా ఆలోచించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు శ్రీనివాస గౌడ. సాఫ్ట్‌వేర్ కొలువును వదులుకుని.. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లి జూన్ 8వ తేదీన గాడిదలను పెంచేందుకు వ్యవసాయ క్షేత్రాన్ని తెరిచారు. కర్నాటకలో గాడిదలను పెంచడం ఇదే మొదటిది కాగా.. దేశంలో ఇది రెండవది. గతంలో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో గాడిదల పెంపకం కోసం ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు.
బీఏ పట్టభద్రుడైన శ్రీనివాస గౌడ 2020లో ఐటీ ఉద్యోగం మానేసిన తర్వాత ఇరా గ్రామంలో.. 2.3 ఎకరాల స్థలంలో సమగ్ర వ్యవసాయం, పశుసంవర్ధక, పశువైద్య సేవలు, శిక్షణ, పశుగ్రాసం అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ క్షేత్రంలోనే మేకల పెంపకాన్ని ప్రారంభించారు. అనంతరం కుందేళ్లు, కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. తాజాగా 20 గాడిదలతో వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు.
గాడిదల పెంపకం ఆలోచన చెప్పినప్పుడు చాలామంది ఎగతాళి చేశారంటున్న శ్రీనివాస గౌడ గాడిద పాలు రుచికరమైనవే కాకుండా చాలా ఖరీదైనవని చెబుతున్నారు. గాడిద పాలు చాలా ఔషధ విలువలను కలిగి ఉంటాయని వివరిస్తున్నారు. ప్యాకెట్ల ద్వారా గాడిద పాల సరఫరా చేపడతామంటున్న శ్రీనివాసగౌడ 30 మిల్లీలీటర్ల పాలప్యాకెట్ ధర రూ.150గా ఉంటుందని చెబుతున్నారు. మాల్స్, షాపులు, సూపర్ మార్కెట్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పారు. బ్యూటీ ఉత్పత్తుల కోసం కూడా గాడిద పాలను విక్రయించేందుకు శ్రీనివాస గౌడ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 17 లక్షల విలువైన ఆర్డర్లు ఇప్పటికే వచ్చాయని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి : పంజా విసురుకున్న పులులు.. వేటాడిన ఆహారం కోసం ఘర్షణ.. చివరకు..