ఉత్తర్‌ప్రదేశ్‌లో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉంచిన ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహానికి కుటుంబ సభ్యులు రోజూ గంగాజలంతో స్నానం చేయించేవారని, 24 గంటలూ ఏసీ ఆన్‌లోనే ఉంచేవారని అధికారులు గుర్తించారు. మృతుడు శ్వాస తీసుకుంటున్నాడని భావించి.. ఇన్నిరోజులు జాగ్రత్తగా చూసుకున్నారని తేల్చారు.
కాన్పుర్ రావత్‌పుర్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్(38) అనే వ్యక్తి .. అహ్మదాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. 2021 ఏప్రిల్ 22న అతడు మరణించాడు. అయితే విమలేశ్ మృతి చెందినా.. అతడు కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబసభ్యులు. విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తోంది. పెన్షన్ దరఖాస్తు చేయడానికి విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించగా.. మొత్తం విషయం బయటపడింది. ఆదాయ పన్నుశాఖ.. సీఎంఓకు ఈ విషయాన్ని తెలియజేసింది. సీఎంఓ వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. మృతుడి సోదరుడు దినేశ్‌ను ప్రశ్నించారు. విమలేశ్ గుండె కొట్టుకోవడాన్ని తాను విన్నానని దినేశ్.. పోలీసులతో తెలిపాడు. 'చనిపోయిన విమలేశ్ అంత్యక్రియలకు ఏర్పాటు చేశాం. అతడి శవంపై పడి ఏడుస్తుంటే నాకు గుండె కొట్టుకోవడం వినిపించింది. పల్స్ ఆక్సీమీటర్‌తో చెక్ చేస్తే.. ఊపిరి ఆడుతున్నట్లు తెలిసింది. కానీ వైద్యులెవరూ ట్రీట్మెంట్కు ముందుకురాలేదు. అందుకే మృతదేహాన్ని ఇంట్లో ఉంచాం' అని దినేశ్.. పోలీసులకు తెలిపాడు. విమలేశ్ జబ్బుపడ్డాడని.. ఎప్పటికైనా తిరిగొస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, తాజాగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. విమలేశ్ ఏడాదిన్నర క్రితమే చనిపోయినట్లు నిర్ధరించారు. మరోవైపు, ఇంట్లో పెద్దలు ఏది చెబితే మృతదేహానికి అది చేసేవాళ్లమని విమలేశ్ భార్య పోలీసులతో అన్నారు.
నలుగురు దారుణ హత్య..
మరోవైపు.. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లా కుమ్హారీ ప్రాంతంలోని కస్పాడా గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో భర్త, భార్య, ఆ దంపతుల ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిని భోలానాథ్ యాదవ్(34), నైలా యాదవ్(30), పర్మాద్(12), ముక్త(7)గా గుర్తించారు. ఒడిశా వీరి స్వరాష్ట్రం కాగా.. గత పన్నెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు.
బుధవారం రాత్రి 8.30 గంటలకు నైలా.. సుమారు గంటన్నర పాటు ఫోన్లో మాట్లాడిందని.. రాత్రి 10 గంటలకు హత్యలు జరిగాయని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకొని, దానిపై ఉన్న వేలి ముద్రలను సేకరించినట్లు స్పష్టం చేశారు. మృతులు ఉంటున్న ఇంటి గురించి బాగా తెలిసినవారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, నైలా సోదరుడే హత్యలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నామని తెలిపారు.
కిరాతక తండ్రి..
డబుల్ బెడ్‌పై నిద్రపోతానని మారం చేసిన సవతి కొడుకును దారుణంగా కొట్టి చంపాడు ఓ కిరాతకుడు. మృతుడిని రాజు(10)గా గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పుష్ప విహార్ కాలనీకి చెందిన ప్రేమ్‌వీర్.. మూడు నెలల క్రితం రాజు తల్లి నీలంను వివాహం చేసుకున్నాడు. రాజు తండ్రి అంతకుముందే మరణించాడు. నీలం ఇద్దరు కుమారులతో ప్రేమ్‌వీర్ బాగానే ఉండేవాడు.
అయితే, బుధవారం రాజును కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఇంట్లోని డబుల్‌కాట్ బెడ్‌పై నిద్రపోతానని అడగడమే ఆ చిన్నారి చేసిన పాపం. ఈ సమయంలో నీలం సైతం ఇంట్లోనే ఉంది. రాజు మరణించగానే ప్రేమ్‌వీర్ ఇంట్లో నుంచి పారిపోయాడు. బంధువుల సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.
అనుమానంతో హత్యలు...
మహారాష్ట్ర కొల్హాపుర్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ వెలుగులోకి వచ్చింది. కాగల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రకాశ్ బాలసో మాలి(42).. సొంత భార్య, పిల్లలను హత్య చేశాడు. భార్య క్యారెక్టర్‌పై వచ్చిన అనుమానంతోనే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు.
నిందితుడు హమిద్వాడాలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. నిందితుడికి తన భార్య గాయత్రి(37)తో తరచూ గొడవ జరుగుతుండేది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ గాయత్రిని నిలదీసేవాడు ప్రకాశ్. ఈ క్రమంలోనే బుధవారం వాగ్వాదం తీవ్రం కాగా.. భార్య గొంతు నులిమి చంపేశాడు. సాయంత్రం తన పిల్లలు ఇంటికి వచ్చేంతవరకు భార్య శవం ఎదురుగానే కూర్చున్నాడు. పోలియోతో బాధపడుతున్న తన కొడుకు(ఎనిమిదో తరగతి) ఇంటికి రాగానే.. అతడి గొంతు నులిమేశాడు. పదకొండో తరగతి చదువుతున్న కూతురు రాత్రి 8గంటలకు ఇంటికి వచ్చింది. ఆమెను సైతం ప్రకాశ్ చంపేశాడు. ఈ క్రమంలో కూతురు గట్టిగా అరవగా.. తలపై రోకలితో కొట్టాడు. ఆ తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తనను పోలీసులు అరెస్టు చేస్తే.. పిల్లల్ని చూసుకునేందుకు ఎవరూ ఉండరన్న కారణంతోనే చిన్నారులను సైతం హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.
కట్నం కోసం వేధించి..
బిహార్ బక్సర్ జిల్లాలో కట్నం కోసం మహిళను అత్తింటివారు హింసించారు. డబ్బుల కోసం ఆమె శరీరానికి నిప్పంటించారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 24నాటి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. యూపీలోని గాజీపుర్‌కు చెందిన అంజలీ రాయ్, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమార్పుర్ గ్రామానికి చెందిన యువకుడు సూర్యదేవ్ రాయ్‌లకు 2021 నవంబర్ 21న వివాహం జరిగింది. అయితే, కొద్దిరోజుల తర్వాత రూ.5 లక్షల కట్నం కోసం అంజలిని సూర్యదేవ్ వేధించాడు.
ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆమెకు నిప్పంటించినట్లు తెలుస్తోంది. తాగునీరు ఇవ్వాలని అంజలి ప్రాధేయపడినా.. అత్తింటివారు నిరాకరించడం వీడియోలో కనిపిస్తోంది. 'నువ్వే ఒంటికి నిప్పంటించుకున్నావని చెప్పు' అని నిందితులు డిమాండ్ చేయడం వీడియోలో వినిపిస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి అత్తవారి కుటుంబంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అంజలి మామ కమలేశ్ రాయ్‌ను అరెస్టు చేశారు.
మైనర్‌పై అత్యాచారం..
ఉత్తర్‌ప్రదేశ్ భదోహిలో 15 ఏళ్ల బాలుడు మైనర్‌పై అత్యాచారం చేశాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక ఇంటి బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి వచ్చిన బాలుడు.. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేశాడు. బాధితురాలు ఉదయం తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కూతురిపైనే కామంతో..
11ఏళ్ల వయసు ఉన్న కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చివరిసారి సెప్టెంబర్ 20న తన కూతురిపై రేప్ చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడని చెప్పారు. బాధితురాలి తల్లి సెప్టెంబర్ 27న పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం అతడిని న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. నిందితుడు గతంలోనూ బాలికపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడని, తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడని బాధితురాలి తల్లి పేర్కొంది.
కూతురిని హత్య చేసి బూటకం..
భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి కోపంలో కూతురిని పొలంలోని ఓ నీటి కుంటలో పడేసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు కట్టుకథ చెప్పాడు. ఎవరో తన కూతురిని కిడ్నాప్ చేశారని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. నిందితుడిని జగన్నాథ్ ధాక్నేగా గుర్తించారు. పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించగా.. చివరకు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
మహిళపై వైద్యుల రేప్..
ముగ్గురు వైద్యులు కలిసి ఓ మహిళను రేప్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. బస్తీలోని ఓ ఆస్పత్రికి చెందిన వైద్యుడు.. లఖ్‌నవూకు చెందిన ఓ మహిళను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని ఆమెను ఆస్పత్రికి పిలిచాడు. ఆగస్టు 10న ఆస్పత్రికి వచ్చిన ఆమెను.. తన హాస్టల్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడే తన ఇద్దరు సహచర వైద్యులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.