Kangaroo illegal breeding: ఆస్ట్రేలియాలో కనిపించే కంగారూలు ఇటీవల బంగాల్‌లోని జల్‌పాయ్‌గుడి, సిలిగుడి అటవీ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఐదు కంగారూలను అధికారులు గుర్తించారు. గజోల్ దోబా ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా తీవ్ర గాయాలతో ఉన్న మూడు కంగారూలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంగారూలను చికిత్స నిమిత్తం బంగాల్ సఫారీ పార్క్‌కు తరలించారు. అంతకుముందు, ఆస్ట్రేలియన్ కంగారూను అక్రమంగా తరలిస్తుండగా అలిపుర్‌దౌర్ జిల్లా పక్రిబారిలో పట్టుకున్నారు. ఈ కంగారూను అసోంలోని గువాహటి నుంచి తీసుకొచ్చారని... దానిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, సోమవారం మరో రెండు కంగారూలు రోడ్డుపై కనిపించాయి.
Kangaroos smuggling India: అసలు ఈ కంగారూలు బంగాల్ అటవీ ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కంగారూలకు సంబంధించిన వివరాలపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో కంగారూలను కృత్రిమంగా పెంచి, వాటిని అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కృత్రిమ పెంపకం: కంగారూలను మిజోరంలో కృత్రిమ గర్భధారణ ద్వారా పెంచుతున్నారని జల్‌పాయ్‌గుడి సైన్స్ అండ్ నేచర్ క్లబ్ సెక్రటరీ రాజారౌత్ అన్నారు. మయన్మార్ మీదుగా వీటిని ఈశాన్య భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇది అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌గా కనిపిస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. కృత్రిమ గర్భధారణ ద్వారా కంగారూలను పెంచుతున్నారనడానికి కచ్చితమైన ఆధారాలు లేవని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపై దర్యాప్తు జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.
ఇదీ చదవండి: బంగాల్ అడవుల్లో ఆస్ట్రేలియా కంగారూలు.. తీవ్ర గాయాలతో నరకం.. స్మగ్లర్ల పనే!