తనదైన శైలి వ్యాఖ్యలు, ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ క్రమంలో ఆమె మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. "భాజపా నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లోనే భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం లభించింది" అని వ్యాఖ్యానించారు. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం 'భిక్ష' మాత్రమేనని అభిప్రాయపడ్డారు. అలా వచ్చినదాన్ని స్వేచ్ఛ అంటామా? అని ప్రశ్నించారు. "1947లో మనకు లభించిన స్వాతంత్ర్యం బ్రిటిష్ వారి పాలనకు పొడిగింపు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కంగన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆమె మాటల్ని భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. "ఇలాంటి ఆలోచనను పిచ్చితనం అనుకోవాలా? లేక దేశద్రోహంగా భావించాలా?" అంటూ మండిపడ్డారు.
"కేవలం అజాగ్రత్త, నిర్లక్ష్యపు ప్రకటనగా కంగన వ్యాఖ్యలను భావించలేం. కొన్నిసార్లు మహాత్మాగాంధీ త్యాగాలు, దీక్షకు అవమానం జరుగుతోంది. మరికొన్నిసార్లు ఆయన హంతకుడికి గౌరవం దక్కుతోంది. ఇప్పుడు మంగళ్‌పాండే మొదలు రాణి లక్ష్మీబాయి, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఇలా లక్షలాది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పట్ల తిరస్కార ధోరణి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచనను పిచ్చితనంగా పిలవాలా లేదా దేశద్రోహంగానా?"
---వరుణ్ గాంధీ, భాజపా ఎంపీ
గతంలోనూ ఓసారి నాథురాం గాడ్సేను కీర్తించిన వారిపై వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంగనపై విమర్శల వర్షం
కంగనా రనౌత్ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
- "దేశ విముక్తి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమే. సిగ్గుపడండి కంగన" అని కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ ట్వీట్ చేశారు.
- "ఈరోజు మలౌనా ఆజాద్ జయంతి. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన తన జీవితాంతం కష్టపడ్డారు. స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యామంత్రిగా పనిచేశారు. నేడు జాతీయ విద్యా దినోత్సవం కూడా. కానీ విద్యావంతురాలైన కంగనా రనౌత్ ఇలా వ్యాఖ్యానించడం బాధాకరం" అని కాంగ్రెస్ నేత యాస్మిన్ కిద్వాయ్ ట్వీట్ చేశారు.
- "99 ఏళ్ల పాటు భారతదేశానికి స్వాతంత్ర్యం లీజుకిచ్చారు" అంటూ ఇటీవల ఓ భాజపా నేత చేసిన వ్యాఖ్యలతో కంగనా రనౌత్ ప్రకటనను పోలుస్తూ శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది పోస్ట్ చేశారు.
- కంగనా రనౌత్‌పై దేశద్రోహం, రెచ్చగొట్టే ప్రకటనలకు సంబంధించి చర్య తీసుకోవాలని కోరుతూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రీతి శర్మ మేనన్ తెలిపారు.
- "కంగనా వ్యాఖ్యలకు సభలో ఉన్నవారిలో చప్పట్లు కొట్టిన మూర్ఖులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా" అని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- "మనం కొత్త స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభిస్తామా?" అంటూ చిత్ర నిర్మాత ఓనిర్ ప్రశ్నించారు.
- "నోరు తెరిచి విషం చిమ్మే వ్యక్తిని మీరు ఏమని పిలుస్తారు?" అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కంగన పేరెత్తకుండా పరోక్షంగా స్పందించారు.
ఇవీ చదవండి: