మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ తన పార్టీ ఎన్నికల గుర్తు 'బ్యాటరీ టార్చ్‌లైట్' కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకుగాను రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్న కమల్.. పార్టీ గుర్తుగా బ్యాటరీ టార్చ్‌లైట్‌ను ఇచ్చేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ మరియు కేటాయింపు) ఆర్డర్-1968 లోని నిబంధనల ప్రకారం తాము బ్యాటరీ టార్చ్‌లైట్ గుర్తు పొందేందుకు అర్హత ఉందని తెలిపారు.
ఇటువంటి ఎన్నికల గుర్తు కలిగిన ఎంజీఆర్ మక్కల్ కచ్చి పార్టీ ఆ చిహ్నాన్ని ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టార్చ్‌లైట్ గుర్తుపైనే ఎంఎన్ఎం పోటీ చేసినప్పటికీ.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 'బ్యాటరీ టార్చ్‌లైట్'ను తన చిహ్నంగా కేటాయించాలన్న కమల్ అభ్యర్థనను పోల్ ప్యానెల్ ఇటీవల తిరస్కరించింది. మరోవైపు పుదుచ్ఛేరిలో ఎంఎన్ఎం ఎన్నికల గుర్తు బ్యాంటరీ టార్చ్‌లైట్ కావటం గమనార్హం.