కేరళ మున్నార్‌లో తమిళ వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్న.. ప్రముఖ నటుడు జయరామ్ తనయుడు కాళిదాస్ జయరామ్‌కు(kalidas jayaram hotel) చేదు అనుభవం ఎదురైంది(kalidas jayaram news). హోటల్ బిల్లు కట్టలేదని కాళిదాస్‌ను, వెబ్ సిరీస్ బృందాన్ని హోటల్ సిబ్బంది అక్కడే బంధించారు.
హోటల్ గది రెంట్, రెస్టారెంట్ బిల్లులు.. రూ. లక్షకుపైగా అయ్యాయని, నిర్మాణ సంస్థ తమకు డబ్బులివ్వలేదని హోటల్ సిబ్బంది వెల్లడించారు. అందుకే షూటింగ్ కోసం వచ్చిన బృందాన్ని బంధించినట్టు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న మున్నార్ పోలీసులు.. హోటల్ సిబ్బంది, నిర్మాణ బృందంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత హోటల్‌కు డబ్బులు చెల్లించారు. దీంతో సమస్య పరిష్కారమైంది.
జయరామ్ అనేక చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు. తెలుగులో అల్లు అర్జున్ చేసిన అలవైకుంఠపుములో ఆయన నటించారు.

జోజు జోసెఫ్‌కు...
కేరళలో స్టార్ నటుడు జోజు జోసెఫ్‌కు కూడా ఇటీవలే చేదు అనుభవం ఎదురైంది. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కేరళలోని ఎర్నాకుళంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇటీవలే నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నటుడు జోజు జార్జ్.. ట్రాఫిక్‌లో రెండు గంటల పాటు చిక్కుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన కారు దిగి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. సాధారణ పౌరులకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా నిరసనలు తెలపడం తగదని వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు.. జోజు కారు అద్దాన్ని పగలగొట్టారు.
'ఇంధన ధరలు పెంపు అనేది చాలా పెద్ద విషయం. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై నిరసన తెలపాలి. కానీ ఈ విధంగా కాదు. ప్రజలకు కష్టమవుతోంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారు,' అని జోజు భావోద్వేగంతో మీడియా ముందు మాట్లాడారు.
ఈ ఘటనలో కాంగ్రెస్ వాదన మరో విధంగా ఉంది. జోజు మద్యం సేవించి మహిళా కార్యకర్తలతో దురుసగా మాట్లాడారని ఆరోపించింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్ సైతం జోజుపై మండిపడ్డారు. మద్యం సేవించి 'గూండా'లా ప్రవర్తించారన్నారు. జోజుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఘటన జరిగిన కొద్దిసేపటికి త్రిపునితుర ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన జోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన మద్యం సేవించలేదని తేలింది. తాను గొడవలు కోరుకోవడం లేదని, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని జోజు కోరారు. అయితే ఈ విధంగా నిరసనలు తెలపడం సరికాదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:-