MP Avinash Not Attended to CBI Enquiry: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడూ కూడా విచారణకు హాజరు కాలేదు. విచారణ నిమిత్తం సీబీఐ కార్యాలయానికి బయలుదేరి.. మార్గమధ్యలోనే ఆయన పులివెందులకు పయనమయ్యారు. తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని పేర్కొంటూ సీబీఐకు ఆయన లేఖ రాశారు. తన తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాష్ పేర్కొన్నారు.
అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అవినాష్ తల్లికి విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో తల్లి వెంట ఎంపీ అవినాష్‌రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ తీసుకెళ్లడంపై అవినాష్‌రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. అవినాష్‌రెడ్డి తల్లిని పులివెందుల ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నామని తొలుత కుటుంబసభ్యులు అన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నామని తెలిపారు. కానీ ప్రస్తుతం కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు.
అంతకు ముందు హైదరాబాద్ నుంచి తన తల్లిని చూసేందుకు బయల్దేరిన అవినాష్‌రెడ్డి.. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తన తల్లిని తీసుకొస్తున్న అంబులెన్స్ ఎదురైంది. వాహనం దిగివెళ్లి.. తన తల్లిని అవినాశ్‌రెడ్డి పరామర్శించారు. ఆమె యోగ క్షేమాలు తెలుసుకున్న ఆయన.. తల్లిని తరలిస్తున్న అంబులెన్స్ వెంట తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో డోన్ వద్ద అవినాష్ రెడ్డికి స్థానిక వైసీపీ నేతలు భోజనాలు అందించారు.
అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకపోవడంతో.. గైర్హాజరీపై లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చేందుకు ఎంపీ తరఫు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంపై కారణాలు వెల్లడించారు. "అవినాష్ తన ఇంట్లో నుంచి సీబీఐ ఆఫీస్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో తన తల్లి ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం వచ్చింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం అందింది. వెంటనే అవినాష్ పులివెందుల బయలుదేరారు. విచారణకు అవినాష్ హాజరుకాలేరని సీబీఐకి లిఖితపూర్వక సమాచారం ఇస్తాం. సీబీఐ తీసుకునే నిర్ణయం మేరకు మేం ఆలోచిస్తాం. అవినాష్ తండ్రి జైలులో ఉన్నందున తల్లిని చూసుకోవాల్సి ఉంది" అని వ్యాఖ్యానించారు.
సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వరుసగా ఇది రెండోసారి. ఈనెల 16న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ హైదరాబాద్ నుంచి కడప వెళ్లిపోయారు. దీంతో సీబీఐ బృందం కూడా అంతేవేగంగా కడప చేరుకోవడం.. అవినాష్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న(నేడు) విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్ ఇవ్వడం ఉత్కంఠ రేపింది.
దీంతో ఇవాళ విచారణకు హాజరవ్వాల్సిన సమయంలో.. ఆయన మరోసారి గడువు కోరారు. ఈసారి... తన తల్లి ఆరోగ్యం బాగోలేదన్న కారణాన్ని లేఖలో ప్రస్తావించారు. వరుసగా రెండుసార్లు విచారణకు హాజరవ్వాల్సిన తరుణంలోనే... ఆయన విచారణకు హాజరుకాకపోడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుంది.. తీసుకునే చర్యలేంటి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి:
- CBN Fires on CM Jagan: రాష్ట్రంలో కేంద్రీకృత అవినీతికి జగన్ రారాజు.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి:చంద్రబాబు
- Electric Shock: చిత్తూరు జిల్లాలో విషాదం.. నీటి సంపు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
- Dead Body In Front Secretariat: అగ్రహారంలో శ్మశాన వాటిక లేదని శవాన్ని సచివాలయం ముందు ఉంచి..