Jupally Krishnarao Reacts on BRS Suspension: బీఆర్ఎస్ అధిష్ఠానం కొల్లాపూర్ మాజీ ఎమ్మెలే జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్ వేటు అనంతరం మొదటిసారి స్పందించిన మాజీ మంత్రి జూపల్లి హైదరాబాద్‌లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై వ్యవహరించిన తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసత్యాలు మాట్లాడినట్లు రుజువు చేయండి : తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషమేనని.. కానీ ఎందుకు అలా చేశారో స్పష్టంగా చెప్పాలని జూపల్లి కృష్ణారావు అన్నారు. తాను అసత్యాలు మాట్లాడినట్లు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్లుగా సభ్యత్వం పుస్తకాలు తనకు ఇవ్వలేదన్న జూపల్లి.. పార్టీ సభ్యుడిగా తాను ఉన్నట్లా.. లేనట్లా.. అని ప్రశ్నించారు. పారదర్శక పాలన అందించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఇష్టారీతిన పాలన చేస్తా.. అడిగేందుకు మీరెవరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్పై మండిపడ్డారు.
'తెలంగాణ సాధనలో యావత్తు తెలంగాణ సమాజం భాగస్వామ్యం ఉంది. 2011 మార్చిలో సకల జనుల సమ్మె రద్దు చేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. అదే రోజున నాటి సీఎం తెలంగాణ ఉద్యమం అణచివేసినట్లు చెప్పారు. తెలంగాణ నేతలు పదవులు వదిలి ఉండలేరని నాటి కేంద్ర మంత్రి కావూరి చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లా అంతా పాదయాత్ర చేశాను. పార్టీ నుంచి సస్పెండ్ చేసినపుడు సీఎం స్పందించలేదు. సస్పెన్షన్ విషయమై మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.'-జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి
ఎన్నికలలో ఓడిపోవడానికి ప్రభుత్వ పెద్దలే కారణం : స్వరాష్ట్ర సాధనలో భాగంగా ఎమ్మెల్యే, మంత్రి పదవులను త్యాగం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ తనకు ఇచ్చిన బహుమతి ఈ సస్పెన్షన్ అని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యీ జూపల్లి కృష్ణారావు అన్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 స్థానాల్లో 13 చోట్ల బీఆర్ఎస్ గెలిచిందన్న జూపల్లి... ఆ గెలుపులో తన కష్టం, నిజాయతీ ఉన్నాయన్నారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు... ఈసారి తాను ఎన్నికలలో ఓడిపోవడానికి ప్రభుత్వ పెద్దలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లు ఉండొద్దనే ఉద్దేశంతో తనను ఓడించారని, ఓ వైపు టికెట్ ఇస్తూనే.. మరోవైపు ఓడించారని జూపల్లి మండిపడ్డారు. దానికి ఎన్నో కారణాలున్నాయి, వ్యక్తిగత లబ్ధి పొందితే రాజీనామా చేయకపోయేవాడినన్న జూపల్లి కృష్ణారావు... నిరంజన్‌రెడ్డి రాజకీయాలకు రాకముందు నుంచే తాను రాజకీయాలలో ఉన్నానన్నారు.
'ఉద్యమ సమయంలో మా ఇంట్లో వైఎస్‌ఆర్ ఫొటో ఉందన్నారు. మా ఇంట్లో నాడు వైఎస్‌ఆర్ ఫొటో ఉంది.. కేసీఆర్ చిత్రం కూడా ఉంది. మా ఇంట్లో ఎవరి చిత్రం ఉండాలో మీరే చెబుతారా? నేను పార్టీపై ఆరోపణలు చేసినట్లు చెబుతున్నారు. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు చేయాలని చెప్పాను. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చెప్పాను. రూ.లక్ష కోట్లకు పైగా నీటిపారుదల టెండర్లు పిలిచారు. కొల్లాపూర్ వంతెన 30 శాతం తక్కువకు టెండరు పోయింది. టెండరు తక్కువకు పోవడానికి ఆంతర్యం ఏంటి?'- జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: