Judge stabbed by assistant: తమిళనాడు సేలం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కోర్టులో పనిచేసే ఆఫీస్ అసిస్టెంట్.. న్యాయమూర్తిపై కత్తితో దాడి చేశాడు. మరో నగరంలోని జిల్లా కోర్టుకు బదిలీ చేశారనే కోపంతోనే ఆ వ్యక్తి.. జడ్జిని పొడిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 37 ఏళ్ల ప్రకాశ్‌గా గుర్తించారు.
ఇదీ జరిగింది..
జిల్లా న్యాయమూర్తి పొన్పండి.. కోర్టు కాంప్లెక్స్‌లోని తన ఛాంబర్లో ఉండగా ఆఫీస్ అసిస్టెంట్ ప్రకాశ్ ఆయనను కలిసేందుకు వెళ్లాడు. తనను తరుచుగా బదిలీ చేస్తున్న అంశంపై జడ్జితో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయంపై మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కత్తి తీసిన ప్రకాశ్.. జడ్జిపై దాడి చేశాడు. ఆయన అరుపులు విన్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని జడ్జిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం న్యాయమూర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు ప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. తన బదిలీ ప్రతిపాదనను జడ్జి తిరస్కరించిన కారణంగానే పొడిచానని ప్రకాశ్ ఒప్పుకున్నట్లు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ఫోన్ కాల్స్ చిచ్చు.. ప్రియురాలి తలను నేలకేసి కొట్టి హత్య