Jodhpur Mass Killing : రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి తగలబెట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మృతుల్లో ఆరు నెలల బాలిక కూడా ఉందని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
ఒసియన్ ప్రాంతంలోని చెరియా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దుండగులు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి కుటుంబ సభ్యుల గొంతుకోశారు. అనంతరం వారి గుడిసెకు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు రావడం వల్ల గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే నలుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు.
మృతులను పూనారాం (55), అతడి భార్య భన్వారీ (50), కోడలు ధాపు (23), ఆమె ఆరు నెలల కుమార్తె మనీషాగా పోలీసులు గుర్తించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించి ఆధారాలు సేకరించినట్లు జోధ్‌పుర్ రూరల్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.
'హత్యలకు గల కారణాల మాకు పూర్తిగా తెలియదు. అయితే ఇది దొంగతనం కేసు కాదు. హంతకులు.. కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు వచ్చారని మేము భావిస్తున్నాం. మృతి చెందిన కుటుంబ పెద్ద పూనారాం కుమారుడు మంగళవారం రాత్రి భోజనం చేసి క్వారీ పనికి వెళ్లాడు.' అని ధర్మేంద్ర సింగ్ యాదవ్ వెల్లడించారు.
మరోవైపు.. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడు పూనారాం మేనల్లుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. జోధ్‌పుర్ కలెక్టర్ హిమాన్షు గుప్తా, ఎస్పీ సింగ్, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబసభ్యుల హత్య రాజస్థాన్‌లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ కేసును పర్యవేక్షించేందుకు డీజీపీ ఉమేశ్ మిశ్రా.. చెరియా గ్రామానికి వెళ్లాలని అదనపు డైరెక్టర్ జనరల్ దినేశ్‌ను ఆదేశించారు. అలాగే.. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి కూడా జోధ్‌పుర్ ఘటనపై స్పందించారు. జీరో అవర్‌లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సమాధానం ఇస్తుందని తెలిపారు.
'సీఎం రాజీనామా చేయాలి'
జోధ్‌పుర్ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రప్రకాశ్ జోషి డిమాండ్ చేశారు. 'జోధ్‌పుర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులను సజీవ దహనం చేయడం దారుణం. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సొంత జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన కుమారుడు వైభవ్ గహ్లోత్ కీర్తిని పెంచడంలో బిజీగా ఉన్నారు. కానీ రాజస్థాన్ కీర్తి వారి వల్ల తగ్గుతోంది. రాజస్థాన్‌లో ఇటీవల కాలంలో నేరాలు అనేక రెట్లు పెరిగిపోయాయి. శాంతి భద్రతలను కాపాడడంలో రాజస్థాన్ ప్రభుత్వం విఫలమైంది.' అని బీజేపీ చీఫ్ చంద్రప్రకాశ్ జోషి విమర్శించారు.
సీఎం స్వస్థలం.. అయినా నేరాలకు అడ్డా..
జోధ్‌పుర్.. సీఎం అశోక్ గహ్లోత్ స్వస్థలం అయినప్పటికీ ఆ జిల్లాలో నేరాలు జరుగుతున్నాయని నాగౌర్ ఎంపీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నాయకుడు హనుమాన్ బెనివాల్ అన్నారు. ఈ ప్రాంతం డ్రగ్స్ హబ్‌గా మారిందని.. పరిస్థితిని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎన్కౌంటర్ చేయాలని బెనివాల్ కోరారు. జోధ్‌పుర్ ఘటన హృదయాన్ని కలచివేసిందని.. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.