Telangana Gurukul Job Notification 2023 : గురుకుల విద్యా సంస్థల్లో 9 వేల 231 ఉదోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామక సంస్థ 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. డిగ్రీ కాలేజీల్లో 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
Telangana Residential Schools Job notification : జూనియర్ కాలేజీల్లో 2 వేల 8 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. పాఠశాలల్లో 1276 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4 వేల 20 టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ నెల 12న వన్ టైం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్టు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగాలకు ఈ నెల 17న.. పీజీటీకి ఈ నెల 24న, టీజీటీకి ఈ నెల 28న జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, ఇతర పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
రాష్ట్రంలో గత కొంతకాలంగా కొలువుల జాతర కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రూప్-1 సహా పలు కీలక శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ వస్తోంది. వీటిల్లో కొన్నింటికి తొలి విడత రాత పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన పరీక్షల కోసం నిరుద్యోగులు రాత్రిపగలూ తేడా లేకుండా సిద్ధమవుతున్నారు. అంతా సజావుగా సాగుతుండగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం పరిస్థితులను తారుమారు చేసింది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టింది. పేపర్లు లీకైన పలు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్నింటిని వాయిదా వేసింది.
అయితే ఈ లీకేజీ ఘటనపై అధికార, విపక్ష నేతల విమర్శ, ప్రతి విమర్శలతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కాస్త బ్రేక్ రాగా.. తాజాగా గురుకుల విద్యా సంస్థల నియామక సంస్థ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీగా ఉన్న 9231 ఉద్యోగాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి..
నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు
'పది' పరీక్ష లీకేజీ కేసు.. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ