జమ్ముకశ్మీర్ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి డీజీని జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్వాలాలోని ఆయన ఇంట్లోనే ఎవరో గొంతు కోసి, హత్య చేశారు. ఆ గదిలోనే డీజీ మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అనంతరం హేమంత్ ఇంటి పని మనిషి యసీర్ అహ్మద్ కనిపించకుండా పోగా.. అతడే ప్రధాన అనుమానితుడని పోలీసులు భావించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చేపట్టామని జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు.
"ఇది చాలా దురదృష్టకర ఘటన. నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిశాయి. హత్య జరగడానికి ముందు.. పాదం వాచిందని లోహియా ఏదో నూనె రాసుకుంటున్నట్టు తెలిసింది. ఆ సమయంలో నిందితుడు డీజీకి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం పగిలిన సీసాతో గొంతు కోశాడు. మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు. లోహియా గదిలో మంటలు రావడాన్ని బయట ఉన్న భద్రతా సిబ్బంది చూశారు. లోపల నుంచి లాక్ చేసి ఉన్న గది తలుపులను బద్దలుకొట్టి వారు వెళ్లారు. పని మనిషి పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నాం" అని చెప్పారు ముకేశ్. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించినట్లు వివరించారు. హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
"భోజనం చేశాక డీజీ తన గదికి వెళ్లిపోయారు. అయితే.. ఆయనకు ఏదో ఆరోగ్య సమస్య ఉంది. సాయం పేరిట నిందితుడు హేమంత్ గదిలోకి వెళ్లాడు. లోపల నుంచి తాళం వేసి.. డీజీపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. నిందితుడు గతంలోనూ దురుసుగా వ్యవహరించేవాడని, మానసిక స్థిరత్వం లేదని తెలిసింది. అతడి కోసం గాలిస్తున్నాం" అని చెప్పారు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్.
1992 బ్యాచ్‌కు చెందిన హేమంత్ కుమార్ లోహియా.. ఆగస్టులో పదోన్నతి పొంది జమ్ముకశ్మీర్ జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు స్వీకరించారు.
ఉగ్రవాదుల పనా?
డీజీ హత్య వెనుక ఉగ్రవాద కోణం ఇప్పటికైతే కనిపించలేదని జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్ అన్నారు. "పని మనిషే ప్రధాన నిందితుడు. అతడి ప్రవర్తన దురుసుగా ఉండేదని, కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదుల పని అనేందుకు ఇంకా ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. కానీ.. ఏ కోణాన్నీ విస్మరించకుండా సమగ్ర దర్యాప్తు చేపడతాం. హత్యకు ఉపయోగించిన ఆయుధం, నిందితుడి మానసిక స్థితిని తెలియజేసే కొన్ని ఆధారాలను మేము స్వాధీనం చేసుకున్నాం" అని చెప్పారు ముకేశ్.
ఇది మా పనే..
డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య కేసులో ఇంటి పని మనిషిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఓ కీలక ప్రకటన వెలువడింది. ఈ హత్య తమ పనేనని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్-పీఏఎఫ్ఎఫ్ అనే సంస్థ ప్రకటించుకుంది. "ప్రత్యేకంగా నిఘా పెట్టి మా స్పెషల్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఇలాంటి హైప్రొఫైల్ ఆపరేషన్లకు ఇది ప్రారంభం మాత్రమే. మేము తలచుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా కచ్చితత్వంతో దాడి చేయగలమని హిందుత్వ పాలకులకు, వారి భాగస్వాములకు హెచ్చరించేందుకు ఇదంతా. కట్టుదిట్టమైన భద్రత మధ్య కశ్మీర్ పర్యటనకు వస్తున్న హోం మంత్రికి ఇదొక చిరు కానుక. మున్ముందు ఇలాంటి ఆపరేషన్లు మరిన్ని చేపడతాం" అని ఆ ప్రకటనలో పేర్కొంది పీఏఎఫ్ఎఫ్.
పీఏఎఫ్ఎఫ్ అనేది కొత్తగా ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. భారత్‌లో భారీ స్థాయిలో దాడులు చేస్తామన్న బెదిరింపు ప్రకటనలు, వీడియోలతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. 2022 డిసెంబర్లో జమ్ముకశ్మీర్ వేదికగా జీ20 సదస్సును నిర్వహించబోనీయమని ఆగస్టులో పీఏఎఫ్ఎఫ్ ఓ వీడియో ద్వారా హెచ్చరించింది.
అమిత్ షా మూడు రోజుల పర్యటన
కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్ నేత అమిత్‌షా మూడురోజుల జమ్ముకశ్మీర్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. జమ్ముకశ్మీర్‌లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పహారీలకు షెడ్యూల్ తెగ హోదా కల్పించడంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో ముసలానికి కారణమైంది. పార్టీలో భిన్నాభిప్రాయాలను బయటపెట్టింది. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. దీంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. జమ్మూకశ్మీర్‌లో అమిత్‌షా పర్యటన రాజకీయ వేడికి కారణమైంది.