Jennifer Monserrate: గోవాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు ప్రమోద్ సావంత్. పనాజీలోని డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. గోవాకు రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడవ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ చరిత్ర సృష్టించారు. 2019లో మొదటిసారి ఆయన గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
భర్త కోసం త్యాగం: ప్రమోద్ సావంత్‌తో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే.. సావంత్ తొలిసారి సీఎంగా ఉన్న సమయంలో గోవా కేబినెట్లోని ఏకైక మహిళా మంత్రి జెన్నిఫర్ మోన్సెరాట్కు ఈసారి అవకాశం రాలేదు. ఆమె భర్త అటనాసియో మోన్సెరాట్ మాత్రం మంత్రిగా ప్రమాణం చేశారు. అటనాసియో సహా రోహన్ ఖౌంటే, రవి నాయక్, సుభాష్ షిరోద్కర్.. సావంత్ కేబినెట్లో కొత్తముఖాలు.
అటనాసియో గోవాలో ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. జెన్నిఫర్ తాలిగావ్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే.. తన భర్తకు మంత్రిగా అవకాశం దక్కేందుకే జెన్నిఫర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. 2019లో భాజపాలో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అటనాసియో ఒకరు. మనోహర్ పారికర్ ప్రభుత్వంలోనూ ఈయన మంత్రిగా పనిచేశారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలో భాజపా పార్టీ 20 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎంజీపీ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు పలకగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇవీ చూడండి: గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం.. వరుసగా రెండోసారి