బాలీవుడ్ ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు(Javed Akhtar remarks) తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జాతీయ మీడియాతో మాట్లాడిన అక్తర్... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను(ఆరెస్సెస్) అఫ్గాన్‌లోని తాలిబన్లతో పోలుస్తూ వ్యాఖ్యానించారు. హిందూ రాజ్యం కావాలని కోరుకునే వారు, తాలిబన్లు ఒకేలాంటి వారని చెప్పారు. అయితే.. అక్తర్ వ్యాఖ్యలపై భాజపా (Bjp on javed akhtar comments) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు కోరుకుంటున్నట్లుగానే.. ఇక్కడ కొందరు హిందూ దేశం కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనతో ఉన్నవారు ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా వాళ్లందరూ తాలిబన్ల లాంటి వారే. తాలిబన్లు అనాగరికులు. వారి చర్యలు ఏ మాత్రం సహించదగినవి కావు. ఎవరైతే... ఆరెస్సెస్, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌కు మద్దతిస్తున్నారో వాళ్లు కూడా తాలిబన్ల లాంటివారే. ఈ దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. ఇది ఎప్పటికీ తాలిబన్ల దేశంగా మారదు."
-జావేద్ అక్తర్, బాలీవుడ్ గీత రచయిత.
'చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి'
అక్తర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఎమ్మెల్యే, భాజపా ప్రతినిధి రామ్ కదమ్(Mla Ram Kadam on javed akhtar) మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆరెస్సెస్ సిద్ధాంతాలను నమ్మే కోట్లాది మందిని ఆయన అవమానపరిచారని పేర్కొన్నారు.
"జావేద్ అక్తర్ ఇలా వ్యాఖ్యానించడం సిగ్గు చేటు. ఆయన వ్యాఖ్యలు ఎంతో బాధకరమైనవి. ప్రపంచవ్యాప్తంగా సంఘ్, విశ్వహిందూ పరిషత్ సిద్ధాంతాలను నమ్మే కోట్లాది మందిని ఆయన అవమానపరిచారు. అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు.. అదే భావజాలంతో ఉన్న వారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, రాజధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని ప్రజలకు చెప్పాలి. వాళ్లది నిజంగా తాలిబన్ల తరహా భావజాలమే అయితే.. జావేద్ అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగలిగేవారా? ఆయన మాటలు ఎంత అర్థరహితంగా ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది."
-రామ్ కదమ్, భాజపా ఎమ్మెల్యే
"దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన సంఘ్ పరివార్ సభ్యులకు జావేద్ అక్తర్ చేతులు జోడించి, క్షమాపణ చెప్పేవరకు ఆయన సినిమాలను దేశంలో ప్రదర్శించనివ్వబోం" అని రామ్ కదమ్ తెలిపారు.
ఇదీ చూడండి: తాలిబన్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు- భాజపా మండిపాటు
ఇదీ చూడండి: గిలానీ భౌతికకాయంపై పాక్ జెండా- 'ఉపా' కేసు