బెంగళూరులో ఉండే జపనీయుడు హిరోటోషి తనాఖా వీసా గడువు ముగిసింది. ఎలాగైనా భారత్‌లో ఉండేందుకు మాస్టర్ ప్లానే వేశాడు. ఏదైనా కేసులో అరెస్టయితే భారత్‌లో ఉండొచ్చని భావించాడు. దీనికోసం ఏకంగా ఏసీపీ కార్యాలయంలో కుర్చీ దొంగిలించాడు. తనపై కేసు నమోదు చేసి.. త్వరగా అరెస్ట్ చేయమని పోలీసులకు సవాల్ చేస్తున్నాడు.
కారణం ఇదే..
జపాన్‌కు చెందిన హిరోటోషి తనాఖా.. ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం విద్యార్థి వీసాపై 2019లో బెంగళూరు వచ్చాడు. కొన్ని నెలల క్రితం కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌పై దాడి చేశాడు. ఈ ఘటనపై ఆర్టీ నగర్ స్టేషన్లో తనాఖాపై కేసు నమోదైంది. అయితే ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినందు వల్ల కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే... ఈ కేసు దర్యాప్తు సమయంలో పోలీసులు తన వద్ద లంచం తీసుకున్నారన్నది తనాఖా ఆరోపణ.
తనాఖా వీసా గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. అయితే... తన దగ్గర లంచం తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు, తనకు న్యాయం జరిగేంత వరకు భారత్‌లోనే ఉండాలని భావించాడు తనాఖా. ఏసీపీ కార్యాలయంలో కుర్చీ దొంగిలిస్తే తనపై కేసు నమోదు అవుతుందని, తాను ఇక్కడే ఉండొచ్చన్నది అతడి ఆలోచన.
ఇదీ చదవండి : సోదరితో ఫోన్ మాట్లాడినందుకు దారుణ హత్య