Janasena Pawan Kalyan on TOEFL Contract : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ, ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం వెనుక పెద్దకుంభకోణం దాగి ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాలేజి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన టోఫెల్ శిక్షణ 3వ తరగతి వారికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం ఇంగ్లిష్ మాట్లాడటం కోసమే అయితే దానికి టోఫెల్ శిక్షణ అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటిష్ యాసలో ఇంగ్లిష్ మాట్లాడటం గొప్ప కాదన్నారు. ఇంగ్లిష్ భాష నేర్చుకుంటే అద్భుతాలు జరిగితే అమెరికాలో పేదలే ఉండకూడదని, బ్రిటన్, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎవరూ రోడ్ల వెంట తిరిగే వారు కాదని వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో 250స్కూళ్లలో మాత్రమే ఉన్న ఐబీ సిలబస్‌ని మనం 44వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయటం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం వెనుక అవినీతి వ్యవహారాలున్నాయని... 2024లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయాక దానిపై విచారణ చేపడతామని హెచ్ఛరించారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు శిక్షణ కోసం 12వందల కోట్ల రూపాయలు ఐబీ సంస్థకు ఇవ్వబోతున్నారని తెలిపారు. భారతదేశంలోని చట్టాలు ఏవీ ఆ సంస్థకు వర్తించవనే నిబంధన పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి వెయ్యి 56కోట్లు చెల్లించిన తర్వాత ఈటీఎస్ ఇచ్చే సర్టిఫికెట్‌కు విలువ లేదన్నారు. విద్యార్థులపై బలవంతంగా ఎందుకు ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం రుద్దుతున్నారని ప్రశ్నించారు. రూ.100కోట్లు దాటే కాంట్రాక్టులకు జ్యుడిషియల్ ప్రివ్యూ అన్న సీఎం... ఈ ఒప్పందాల విషయంలో ఎందుకు సమీక్ష చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
అది తప్పుడు అభిప్రాయం : పవన్.. కళాశాల పూర్తయ్యే విద్యార్థులకు టోఫెల్ పరీక్ష అవసరం.. కానీ, మూడో తరగతి పిల్లలకు టోఫెల్ పరీక్ష ఏంటో అర్థం కావట్లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమెరికా, బ్రిటీష్ ఉచ్ఛరణ నేర్చుకోకపోతే ఎదగరు అనే తప్పుడు అభిప్రాయం సృష్టిస్తున్నారన్న పవన్.. ఆంగ్ల ఉచ్ఛరణ కోసమైతే వేల కోట్లు ఖర్చు చేయనక్కర్లేదన్నారు. వివిధ దేశాల ఉచ్ఛరణలు యూట్యూబ్‌లోనూ దొరుకుతాయని ఉదహరించారు.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. గొప్ప ఉచ్ఛరణతో మాట్లాడరు.. ఆయన మంత్రి కాలేదా..? సీఎం జగన్ కూడా అమెరికా, బ్రిటీష్ ఉచ్ఛరణతో ఆంగ్లం మాట్లాడరు కదా అని పవన్ ప్రశ్నించారు. పిల్లలకు నేర్పించాల్సింది సృజనాత్మకత, ఆలోచనా శక్తి అని స్పష్టం చేశారు. విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత కోసం భాష ఒక ఉపకరణమే అన్న పవన్.. ఆంగ్లం నేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయని అనుకుంటున్నారని పేర్కొన్నారు. అవగాహన లేమితోనా లేదా స్కామ్ ఉద్దేశంతో చేస్తున్నారా తెలియట్లేదని, విద్యార్థులకు అన్యాయం చేస్తుంటే కచ్చితంగా గొంతెత్తుతాం అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం పోయాక స్కామ్ చేసిన వారినీ జైలుకు పంపాలి.. వైసీపీ ప్రభుత్వంపై మొదటి కేసు ఇదే అవుతుంది అని చెప్పారు. విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్న పవన్.. పతనమవుతున్న బైజూస్ కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చారని తెలిపారు. విదేశీ కంపెనీలతో ఒప్పందం తర్వాత ఉల్లంఘన జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తూ.. స్కామ్ జరుగుతోందనే అనుమానాలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
విద్యా విధానానికి నష్టం : నాదెండ్ల.. విద్యార్థులకు టోఫెల్ పరీక్ష నిర్వహిస్తామని ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. ఫీజుల ద్వారా సంస్థకు రూ.1056 కోట్లు వెచ్చిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల అన్నారు. మూడు నుంచి పది చదివే విద్యార్థులకు టోఫెల్ నిర్వహిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని, పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులకు ధ్రువపత్రం వర్తించదని తెలిపారు. రెండేళ్లలో ధ్రువపత్రం కాలపరిమితి తీరిపోతుందని చెప్తూ.. ఒప్పందం ద్వారా విద్యా విధానానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒప్పందంలో రెండు ఇబ్బందికర క్లాజెస్ పొందుపరిచారని, టీచర్లు ఈ సంస్థ ద్వారానే శిక్షణ ఇవ్వాలని ఒప్పందంలో ఉందని నాదెండ్ల తెలిపారు. టీచర్ల శిక్షణకు రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు వెచ్చించాలని, భారత చట్టాలు వర్తించవని క్లాజ్‌లో పొందుపరిచారని వెల్లడించారు. జెనీవాలో చట్టాల మేరకు ఆర్బిట్రేషన్ జరగాలని ఒప్పందంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఐబీ సిలబస్ తేవాలని కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. న్యాయ, ఆర్థికశాఖ తిరస్కరించినా సీఎం కోరిక మేరకు కార్యక్రమం నిర్వహణ చేపడుతున్నారని అన్నారు.