Pawan Kalyan Meeting With Chandrababu: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో పవన్‌కల్యాణ్ సమావేశమవ్వడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించిన పవన్.. చంద్రబాబుతో భేటీకావడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంపై ఇరుపార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకున్నా.. పొత్తులపైనే చర్చించినట్లు ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ భేటీ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరూ సుమారు గంటన్నరపాటు చర్చించారు. వైసీపీని గద్దెదించడమే లక్ష్యమని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పదేపదే చెబుతున్న పవన్, ఇటీవల దిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపారు. ఇటీవల జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన చంద్రబాబు.. దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు.
ఎన్డీఏలో మళ్లీ చేరబోతున్నారా అని అడగ్గా స్పష్టమైన సమాధానం చెప్పకపోయినా.... ప్రధాని మోదీ విధానాలను ఆయన బహిరంగంగా, బలంగా సమర్థించారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడటంతో పాటు.. రాజకీయ పొత్తులను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా వారిద్దరి మధ్య చర్చలు జరిగయాని సమాచారం. తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ .. చంద్రబాబు, పవన్‌ల భేటీ రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇరువురు నేతలు ఏ అంశాలను మాట్లాడుకుని ఉంటారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. రాష్ట్రంలో పొత్తులపై తమ విధానం ఏంటన్నది దిల్లీలోని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటివరకు బయట పెట్టలేదు. మోదీ విధానాల్ని చంద్రబాబు బహిరంగంగా సమర్థించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనవ్వబోనని పవన్ పదే పదే చెబుతుండటంతో.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల కాలంలో చంద్రబాబు, పవన్ సమావేశమవ్వడం ఇది మూడోసారి. గత ఎన్నికల తర్వాత చంద్రబాబు పవన్‌ల మొదటి సమావేశం 2022 అక్టోబరు 18న విజయవాడలో జరిగగా. పవన్ బస చేసిన హోటల్‌కు చంద్రబాబు వెళ్లి భేటీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై కలసి పోరాడాలని, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో పవన్ పర్యటనలో పోలీసులు అనేక ఆంక్షలు విధించడం, పవన్‌తో దురుసుగా ప్రవర్తించడం బాధ కలిగించాయని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కు సంఘీభావం చెప్పేందుకు వచ్చానని చంద్రబాబు ఆ సమయంలో వివరించారు. వైసీపీ అరాచకాలపై పార్టీలన్నీ కలసి పోరాడటంపై పవన్‌తో మాట్లాడానని, ముందు ప్రజాసమస్యలపై పోరాడతామని ఆయన తెలిపారు. మళ్లీ తర్వాత కుప్పంలో చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడంతో.. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పవన్ సంఘీభావం తెలిపారు. 2023 జనవరి 8న వారి భేటీ జరిగింది. ప్రభుత్వం ఉమ్మడి పోరాటం దిశగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య రాజకీయ పొత్తును బలోపేతం చేసే దిశగా, ఇద్దరు నాయకుల మధ్య రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు జరగనున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: