Pawan Kalyan comments on Alliance: కచ్చితంగా జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ వ్యూహం వేసినా రాష్ట్ర హితం కోసమేనని తెలిపారు. సీఎం అనే పదవి రావాలంటే సముచిత స్థానంలో గెలిపించాలని.. ఆలోచనతో రాజకీయాలు చేయాలని జనసేనాని అన్నారు. పొత్తుపై ఇంకా బీజేపీతో ఆ స్థాయి చర్చలు ఇంకా జరగలేదన్నారు. పొత్తు కొలిక్కి వచ్చాక ప్రజల మధ్య ఒప్పందం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజలకు ఏమేం చేస్తామో ప్రకటించి పొత్తు చేసుకుంటామని అన్నారు.
జగన్‌ను గద్దె దించడమే లక్ష్యం: ఇప్పుడు కావాల్సింది ముఖ్యమంత్రి ఎవరు అనేది కాదని.. ప్రస్తుత ముఖ్యమంత్రిని గద్దె దించడమే లక్ష్యమని పవన్ తెలిపారు. సీఎం ఎవరనేది ఆ రోజు బలబలాలను బట్టి నిర్ణయించుకోవచ్చాన్నారు. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తు ప్రభుత్వాన్ని గద్దెను ఎక్కించడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఫ్యూడలిస్టిక్ సిద్ధాంతాలతో వైసీపీ రాష్ట్రాన్ని నలిపేస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి వైసీపీనేనని తెలిపారు. రాష్ట్రాన్ని వైసీపీ అధోగతి పాల్జేసిందని... గూండాయిజాన్ని పెంచి పోషించిందన్నారు. రైతులకు సకాలంలో డబ్బు ఇవ్వకుండా ద్రోహం చేసిన.. నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీని ప్రత్యర్థిగా భావించాలా.. లేక టీడీపీనా.. అని పవన్ ప్రశ్నించారు.
పోరాడాలి: సమస్యలపై పోరాడే సత్తా ఉండాలని జన సైనికులకు పవన్‌కల్యాణ్ సూచించారు. అందుకోసం జనసేన వేదిక కావాలన్నారు. తానెప్పుడూ నాయకుడిలా భావించలేదని.. సాటి మనిషికి ఏదైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తానన్నారు. జనసేనలో తాను కూడా ఒక కార్యకర్తనేనని.. కాకపోతే నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా పోరాడాలన్నారు. చాలామంది పార్టీ పెట్టగానే సీఎం కావాలని అనుకుంటారని.. కానీ తాను మాత్రం మార్పు కోరుకుంటున్నానని తెలిపారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయవచ్చని చేసి చూపించానని.. ఓట్లు కొనుక్కోకుండా రాజకీయం చేయాలని భావిస్తున్నానన్నారు. అయితే అసలు డబ్బే ఖర్చు పెట్టకుండ రాజకీయాలు కుదరవని.. పార్టీ నడిపేందుకు తాను కూడా ఏడాదికి చాలా కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నిజంగా రాజకీయాల్లో నిలబడాలంటే డబ్బుతో పనిలేదని... మనస్సు ఉంటే చాలని స్పష్టం చేశారు. పార్టీ నడపాలంటే కంకణం కట్టుకోవాలన్నారు. తాను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని, నాయకుడిని కాదన్నారు. తాను మానవతావాదినని, దేశభక్తుడిని అని తెలిపారు.
ఇలాంటి వ్యక్తి మళ్లీ మనకి కావాలా?: వైకాపా నేతలు సకల కళా వల్లభులు అని.. వారికి మా పార్టీ విషయాలు ఎందుకు అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. జనసేన అంటే మీకు భయమెందుకు అని అన్నారు. భారాస 2009లో పొత్తుతో వెళ్లిందన్న పవన్.. పొత్తులు పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో వ్యూహాలు మాత్రమే ఉంటాయని.. భేషజాలు ఉండవని తెలిపారు. వ్యూహాలు నాకు వదిలి బాధ్యతలు మీరు తీసుకోండని జనసైనికులకు పవన్ తెలిపారు. తాను జులై నుంచి ఇక్కడే ఉంటానని పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని స్పష్టం చేశారు. దేవాలయాలు కూల్చేస్తే ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం పట్టుకోలేదని పవన్ అన్నారు. సీఎం హెలికాఫ్టర్‌లో వెళ్తుంటే కింద ఉన్న పచ్చని చెట్లు కొట్టేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో పచ్చదనాన్ని చంపేస్తున్నారన్నారు. అడ్డగోలుగా సంపాదించి మనల్ని బెదిరిస్తారా? ఇంకోసారి ఇలాంటి వ్యక్తి సీఎం అయితే ఏపీ కోలుకోలేదని జనసేనాని స్పష్టం చేశారు. రోడ్లు వేయని వ్యక్తి మళ్లీ మనకి కావాలా? రైతులకు న్యాయం చేయని వ్యక్తి మళ్లీ మనకి కావాలా? మహిళలకు రక్షణ కల్పించలేని వ్యక్తి మళ్లీ మనకి కావాలా? పోలవరం పూర్తిచేయని వ్యక్తి మళ్లీ మనకి కావాలా? ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని వ్యక్తి మళ్లీ మనకి కావాలా? అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
కేకలు వేస్తే ముఖ్యమంత్రిని కాలేను: ఏటా కార్యకర్తల ఆరోగ్యం కోసం రూ.కోటి ఖర్చు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. తాను ఒక కులం, వర్గం వాడిని కాదని.. అంతా సమానమే అన్నారు. తనకు అన్నిచోట్లా అభిమానులు ఉన్నారని పవన్ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇన్ని పార్టీలు లేవన్న ఆయన.. పదవిని లక్ష్యం చేసుకుని పార్టీ పెట్టలేదన్నారు. సీఎం సీఎం అని కేకలు వేస్తే ముఖ్యమంత్రిని కాలేనని.. క్రేన్లతో గజమాలలు వేసే కన్నా... ఓట్లు వేయాలని పవన్ అందరికీ సూచించారు. 134 స్థానాల్లో పోటీచేస్తే.. కనీసం 40 గెలిచినా సీఎం అయ్యేవాళ్లమని గుర్తు చేశారు. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని గుర్తించాలన్నారు. కొంతమంది నన్ను వదిలేసినా వారి గుండెల్లో నా స్థానం అలాగే ఉందని పవన్ అన్నారు. ప్రజల కోసం ఐదేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకున్నానన్నారు. అనుకూల, ప్రతికూల పరిస్థితులను తట్టుకున్నవారే నాయకులని.. తెదేపా నాయకులను సీఎం చేసేందుకు జనసేన లేదని పవన్ స్పష్టం చేశారు. మనకు ఎంత బలం ఉందో బేరీజు వేసుకోవాలని జనసైనికులకు పవన్ గుర్తు చేశారు. ప్రజాశక్తిని ఓట్ల కింద మార్చుకోవాలంటే తన అంత బలంగా తిరగాలన్నారు. ఒక్కొక్కరికి వంద ఓట్లు వేయించగలిగే సత్తా ఉండాలన్నారు. ఏం చేసినా నిర్మాణాత్మకంగా చేయాలన్నారు. భావోద్వేగం మనిషికి అవసరమన్న ఆయన.. స్పందన లేనివాడు నాయకుడు కాలేడన్నారు. అవసరమైనప్పుడు తగ్గాలి.. ఒక్కోసారి బొబ్బిలిలా తిరగబడాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: