జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలతో ఏర్పాటైన గుప్కార్ కూటమి 112 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. 74 స్థానాలు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్రులు, ఇతర పార్టీలు మిగిలిన స్థానాలను దక్కించుకున్నాయి.
ఏంటీ ఎన్నికలు?
గతేడాది జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం.. తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్ము కశ్మీర్ పంచాయతీరాజ్ చట్టంలోని 73వ సవరణను అమలు చేసి... అక్కడి 20 జిల్లాల్లో 280 జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ)ను ఏర్పాటు చేశారు. ఈ డీడీసీలకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో స్థానిక సమరం- ఎందుకింత ప్రాధాన్యం?
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 14 డీడీసీ నియోజకవర్గాలు ఉంటాయి. వీటిలో ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి.. ఛైర్మెన్, వైస్-ఛైర్మెన్లను ఎన్నుకుంటారు. కొత్త చట్టం ప్రకారం స్థానిక ఎంపీ.. డీడీసీల్లో సభ్యులుగా ఉండరు.
స్థానికంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేయడానికి డీడీసీలకు అధికారం ఉంటుంది. ప్రతి డీడీసీలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీతో పాటు.. అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, ఆరోగ్యం-విద్య, సంక్షేమం వంటి విభాగాలకు స్టాండింగ్ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. మున్సిపల్ పరిమితుల్లోకి వచ్చే ప్రాంతాలు మినహాయించి మొత్తం జిల్లాపై.. డీడీసీ అధికార పరిధి ఉంటుంది. వీటి పదవీకాలం ఐదేళ్లు.
ఎన్నికలపై ఆర్టికల్-370 రద్దు ప్రభావం ఉందా?
ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది దాటిపోయినా.. ఇక్కడి రాజకీయాలు ఇంకా ఆ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం మంచిదేనని నిరూపించుకునేందుకు ఎన్నికల బరిలో దిగింది భాజపా. మరోవైపు, ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని గుప్కార్ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారని ఆసక్తిగా ఎదురు చూశారు ప్రజలు.
మరి ఫలితాల సరళి ఎలా ఉంది?
ఫలితాల్లో భాజపా అనూహ్యంగా పుంజుకుంది. తనకు పట్టున్న జమ్ములో భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకోవడమే కాక.. తొలిసారి కశ్మీర్లో ఖాతా తెరిచింది. లోయలో మూడు స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంగా 74 స్థానాలతో జమ్ము కశ్మీర్ స్థానిక ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్థానికంగా గట్టి పోటీ ఇచ్చే పార్టీలను ఎదుర్కొని భాజపా ఈ ఫలితాలను రాబట్టింది.
ఇదీ చదవండి: కశ్మీర్లో 'స్థానిక' పోరు- కార్యక్షేత్రంలోకి కాషాయదళం
మరోవైపు, కశ్మీర్ లోయ సహా పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో గుప్కార్ కూటమి ఆధిక్యం నిలుపుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 67, పీడీపీ 27 స్థానాలను కైవసం చేసుకోగా... గుప్కార్లో ఇతర పార్టీలైన పీడీఎఫ్ 2, సీపీఐఎం 5, జేకేపీఎం 3, జేకేపీసీ 8 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 26 స్థానాలకు పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 49 మంది గెలుపొందడం విశేషం.
ఎవరికి ఎన్ని ఓట్లంటే...
- భాజపా 4.87 లక్షలు
- గుప్కార్ కూటమి 3.94 లక్షలు
- కాంగ్రెస్ 1.39 లక్షలు
- స్వతంత్రులు 1.71 లక్షల ఓట్లు
ఎవరికి ఎన్ని జిల్లాలు?
భాజపా 75 సీట్లు గెలుచుకున్నప్పటికీ.. ఆరు జిల్లాల్లోనే ఆధిక్యానికి కావాల్సిన మార్కును అందుకుంది. జమ్ము, కథువా, ఉధంపుర్, సాంబ, దోడా, రియాసీ జిల్లాల్లోని డీడీసీలను ఆ పార్టీ కైవసం చేసుకొనే అవకాశం ఉంది. ఇవన్నీ జమ్ము ప్రాంతంలోనివే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: కశ్మీర్ లెక్కలు మార్చిన డీడీసీ ఎన్నికలు!
పీర్ పంజల్ సహా చినాబ్లోని కిష్టావర్, రాంబన్ గుప్కార్ కూటమి మంచి ఫలితాలు సాధించింది. కశ్మీర్లో చాలా ప్రాంతాల్లో ఆధిక్యం ప్రదర్శించింది.
'370' రద్దుకు ప్రజలు అనుకూలమా? వ్యతిరేకమా?
ప్రజలు తమకు అనుకూలంగానే ఉన్నారని, ఆ విషయం ఫలితాల్లో తేలిందని ఇరు పక్షాలు చెప్పుకుంటున్నాయి.
ప్రధాని మోదీపై జమ్ము కశ్మీర్ ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి ఫలితాలు నిదర్శనమని భాజపా వర్గాలు చెబుతున్నాయి. మోదీ అభివృద్ధి దృక్పథాన్ని మెచ్చి ఓటర్లు తమకు పట్టం కట్టారని పేర్కొంటున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకాన్ని కశ్మీర్ ప్రజలు వ్యక్తపరిచారు. నూతన కశ్మీర్, సబ్కా సాత్-సబ్కా వికాస్- సబ్కా విశ్వాస్‌పై విశ్వాసం ఉంచారు. లోయలో మార్పు పవనాలు వీస్తున్నాయి. కశ్మీర్లో తొలి విజయం సాధించడం.. లోయలో నూతన శకం మొదలైందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది."
-విబోద్ గుప్తా, భాజపా ప్రధాన కార్యదర్శి, కశ్మీర్ విభాగం
అయితే ప్రజలు ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఉన్నారని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించారని అన్నారు.
"గుప్కార్‌కు ప్రజలు పట్టం కట్టారని డీడీసీ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టమవుతోంది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా తిరిగి ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు."
-మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి
"లోయలో గెలుచుకున్న 3 సీట్ల విజయాన్ని భారీగా చూపించాలన్న భాజపా ఉత్సాహాన్ని అర్థం చేసుకున్నా. కానీ జమ్ములో 35 స్థానాలు గెలుచుకున్న గుప్కార్ విజయాన్ని తక్కువ చేస్తున్నారు. మా పార్టీలు కశ్మీర్‌కు పరిమితమైనవి కావు. జమ్ము కశ్మీర్ అంతటా పటిష్ఠమైన మూలాలున్న రాజకీయ పార్టీలు."
-ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు
ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కశ్మీర్ పట్ల భాజపా అనుసరిస్తున్న విధానాన్ని ఓటర్లు వ్యతిరేకించారనే విషయం డీడీసీ ఫలితాల్లో తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. భాజపా విభజనపూరిత రాజకీయాలను జమ్ము ప్రజలు సైతం తిరస్కరించారని అన్నారు.
చివరగా...
ఖాళీ పోలింగ్ బూత్‌లు... కేంద్రాల వద్ద రక్తపాతం... వర్గాల మధ్య హింస.. ఒకప్పుడు కశ్మీర్ ఎన్నికలంటే కళ్లముందు మెదిలేవి ఇవే! అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఎనిమిది విడతల ఎన్నికల్లో ఎక్కడా ఉగ్రవాదుల జాడ లేదు. పోలింగ్ స్టేషన్లు ఓటర్లతో కళకళలాడాయి. తీవ్రమైన చలిలోనూ ఓటేసేందుకు బారులు తీరారు. ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దలతో పాటు యువత సైతం ఎన్నికల్లో పాల్గొనడం సానుకూలాంశం. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల కశ్మీరీల దృక్కోణం మారటం మాత్రం విజయమే అని చెప్పడంలో సందేహం లేదు!