కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో విషాదం నెలకొంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరికి ఒక్కసారి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్‌లోని ఫిలౌర్ ప్రాంతంలో కొనసాగుతోంది. శనివారం ఉదయం ఈ యాత్రలో పాల్గొని రాహుల్ గాంధీతో కలిసి నడిచిన జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను లూధియానాలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోఖ్ మృతికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్ సభ్ స్పీకర్ ఓం బిర్లా సంతాపం ప్రకటించారు.
సంతోఖ్ సింగ్.. 1946 జూన్ 18న జలంధర్‌లోని ధలివాల్ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. కాగా, ఎంపీ సంతోఖ్ సింగ్ హఠాన్మరణంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.