కర్ణాటక శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశాతో పాటు మేఘాలయలో ఈ ఉపఎన్నికలు జరిగాయి.
పంజాబ్-జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం..
పంజాబ్‌లో కాంగ్రెస్ కంచుకోట అయిన జలంధర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆప్ అభ్యర్థి సుశీల్ రింకూ తన సమీప ప్రత్యర్థి కరమ్ జిత్ కౌర్ చౌదరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన కరమ్‌జిత్ కౌర్ చౌదరిపై.. 58,691 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఉప ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రింకూ. అనంతరం ఆప్‌లో చేరి.. ఆ పార్టీ తరుపున పోటీ చేశారు.
ఒడిశాలో-ఝార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం..
ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్(బీజేడీ) ఝార్సుగూడ అసెంబ్లీ స్థానాన్ని నిలుపుకుంది. బీజేడీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి డిపాలి దాస్.. తన సమీప ప్రత్యర్థి టంకధర్ త్రిపాఠిపై విజయం సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన త్రిపాఠిపై 48,721 ఓట్ల తేడాతో గెలుపొందారు. డిపాలి దాస్ తండ్రి నాబా కిషోర్ దాస్.. 2023 జనవరిలో హత్యకు గురయ్యారు. ఆయన ఝార్సుగూడ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. కిషోర్ దాస్.. నవీన్ పట్నాయక్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఆయన మరణం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.
మేఘాలయ- సోహియాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం..
మేఘాలయలోని సోహియాంగ్ శాసనసభ స్థానంలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ(UDP) అభ్యర్థి సిన్షార్ కుపర్ రాయ్ థాబా 3,400 ఓట్లకు పైగా మోజారిటీతో విజయ ఢంకా మోగించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్పీపీ అభ్యర్థి సమ్లిన్పై.. సిన్షార్ విజయం సాధించారు. ఫిబ్రవరి 7న యూడీపీ అభ్యర్థి హెచ్‌డిఆర్ లింగ్డో మరణం కారణంగా ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.
ఉత్తర్ ప్రదేశ్-సువార్ అసెంబ్లీ నియోజకవర్గం..
ఉత్తర్ ప్రదేశ్ రాంపుర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ-మిత్రపక్షం అప్నాదళ్ అభ్యర్థి షఫీక్ అహ్మద్ 8,724 ఓట్ల తేడాతో గెలుపొందారు. సమాజ్ వాద్ పార్టీ అభ్యర్థి అనురాథపై ఆయన విజయం సాధించారు. మరో నియోజకవర్గం ఛన్బే అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అప్నాదళ్ అభ్యర్థి రింకీ కోల్.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన కీర్తి కోల్‌పై 9,587 ఓట్ల తేడాతో విజయం సాధించారు.