హిమాచల్ ప్రదేశ్లో మంచు వర్షం ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా అక్కడ మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలోని నీరంతా ఎక్కడికక్కడ గడ్డకట్టుకుపోయింది. మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. నీళ్లన్ని ముందుకు వెళ్లకుండా పైపుల్లోనే గడ్డకట్టుకుపోయాయి. ప్రజల ఇళ్లకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎగువ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా మంచుతో నిండిపోయింది.
అయితే లాహౌల్ స్పీతి జిల్లా జల్ శక్తి శాఖ మాత్రం.. అక్కడి నీటి సరఫరా సమస్యను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తోంది. పైపులను వేడి చేసి మరీ నీరు సరఫరా అయ్యేలా చూస్తోంది. దీంతో మంచు రూపంలో ఉన్న నీరంతా కరిగి ఇళ్లకు చేరుతోంది. జల్ శక్తి డిపార్ట్మెంట్ సిబ్బంది చర్యలతో స్థానికులకు నీటి కష్టాలు తీరుతున్నాయి. దీంతో సిబ్బందికి స్థానికులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారు కూడా సిబ్బందికి సాయం అందిస్తున్నారు. ఇంత చలిలో సైతం ప్రజల సమస్యను తీర్చుతున్నందుకు సిబ్బందిని అధికారులు అభినందించారు. మంచి మనసుతో స్థానికుల తాగునీటి సమస్యలు తీర్చుతున్నారంటూ కొనియాడారు.