పంజాబ్‌లోని ఫిరోజ్పుర్లో అక్రమంగా తరలిస్తున్న 180 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. నియంత్రణ రేఖ సమీపంలో 12.9 కేజీల హెరాయిన్ దాచినట్లు అతడు విచారణలో తెలిపాడు. వెంటనే పాలీసులు దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ రూ. 65 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
కశ్మీర్‌లోనూ..
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో చేసిన తనిఖీల్లో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న మాదకద్రవ్యాల ముఠా గుట్టు రట్టు చేశారు స్థానిక పోలీసులు. సుమారు రూ.50 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని కరెన్ బాలా ప్రాంతానికి చెందిన ముజాసిర్ అహ్మద్ లోన్ అనే ఉగ్ర సహచరుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అతడి నుంచి 8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో ఇతరుల ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిపిన పోలీసులు.. వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
"పెద్దమొత్తంలో పాకిస్థాన్‌కు చెందిన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాము. డ్రగ్స్‌ను సరఫరా చేయడం ద్వారా కశ్మీర్‌లోయలో ఉండే ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ డ్రగ్ రాకెట్‌కు పాక్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు మేం గుర్తించాం. లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఈ వ్యాపారం సాగుతోంది. అలానే స్థానిక యువతను తప్పుదారి పట్టించి ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి."
-పోలీసులు
ఇదీ చూడండి: 'బాబా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి'