భారత్-చైనా సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వర్తించే ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళంలో ఆదివారం అరుదైన ఘట్టం సాక్షాత్కారమైంది. శిక్షణ పూర్తి చేసుకున్న ఇద్దరు మహిళా అధికారులకు తొలిసారి యుద్ధ విధులు నిర్వర్తించే అవకాశం దక్కింది. ఉత్తరాఖండ్ ముస్సోరిలోని శిక్షణా అకాడమీలో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో వీరు బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 53 మంది అధికారుల పాసింగ్ ఔట్ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఐటీబీపీకి సంబంధించి విశేషాలు, ఫొటోలతో 680 పేజీలతో రూపొందించిన 'హిస్టరీ ఆఫ్ ఐటీబీపీ' పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్తో కలిసి ధామీ విడుదల చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం.. మహిళా అధికారులైన ప్రకృతి, దీక్షలకు అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ ర్యాంకు హోదాను ధామీ, దేశ్వాల్ అందించారు.
ఆనంద క్షణాలు..
భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో సేవలందించిన అధికారి కుమార్తె ప్రకృతి కాగా.. ఐటీబీపీలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కమలేశ్ కుమార్ కుమార్తె దీక్ష. పరేడ్ అనంతరం.. ఖాకీ యూనిఫామ్ ధరించిన కమలేశ్ కుమార్ తన కుమార్తె దీక్షకు సెల్యూట్ చేయగా.. అందుకు తన తండ్రికి దీక్ష తిరిగి సెల్యూట్ చేసింది. ఆ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. 'మా నాన్నే నా రోల్ మోడల్, ఆయన నన్ను ఎప్పుడూ ఇతరులకంటే తక్కువగా చూడలేదు' అని దీక్ష చెప్పారు. ఐటీబీపీలో జీవితం క్లిష్టమైనదే అయినా.. అది సవాళ్లతో, ఉత్తేజంగా ఉంటుందని ప్రకృతి పేర్కొన్నారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు.
'ఆ కష్టాలు నాకు తెలుసు..'
మహిళా కంబాట్ ఆఫీసర్ల నియామకాన్ని ఐటీబీపీ 2016లో ప్రారంభించింది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష ఆధారంగా వారిని ఎంపిక చేస్తుంది. అంతకుముందు మహిళలకు ఐటీబీపీలో కానిస్టేబుల్ హోదా మాత్రమే ఉండేది. తాజాగా నియమితులైన అధికారులకు జనరల్ డ్యూటీ కేడర్లో 50 వారాలు పాటు, ఇంజినీరింగ్ కేడర్లో 11 వారాలపాటు కఠిన శిక్షణ అందించారు.
విధులు నిర్వర్తించేటప్పుడు తమ శక్తి మేర సాహసాన్ని ప్రదర్శించాలని ఈ కార్యక్రమంలో పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. సాయుధ బలగాలు, వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని చెప్పారు. "నేనో సైనికుడి కుమారుడిని. ఆర్మీ గురించి నాకు బాగా తెలుసు. సైనికుల కుటుంబాల్లో ఉండే కష్టాలను నేను చూశాను"అని ఆయన అన్నారు.
ఐటీబీపీ కార్యకలాపాల గురించి సమగ్రమైన వివరాలను తెలిపే లక్ష్యంతో హిస్టరీ ఆఫ్ ఐటీబీపీ పుస్తకాన్ని తీసుకువచ్చామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే తెలిపారు.
ఇదీ చూడండి: చైనా సరిహద్దులోని సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు
ఇదీ చూడండి: 'గోగ్రా హైట్స్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణ'