బీబీసీ ఇండియా కార్యాలయాల్లో మూడో రోజూ ఆదాయపు పన్నుశాఖ సర్వే కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారం నకలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు దిల్లీ, ముంబయి బీబీసీ కార్యాలయాల్లో మొదలైన సర్వే ఇంకా కొనసాగుతోంది. ఈ సర్వే మరికొంత కాలం జరుగుతుందని అధికారులు తెలిపారు.
'లండన్ హెడ్ ఆఫీస్‌తో పాటు భారత్‌లోని కార్యాలయం బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అధికారులు వెతుకుతున్నారు. బీబీసీ అనుబంధ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్ వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది పూర్తిగా బీబీసీ బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించినదే' అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొన్ని వారాల క్రితమే మోదీపై.. "ఇండియా.. ద మోదీ క్వశ్చన్" పేరిట బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. రెండు భాగాలుగా దీన్ని రూపొందించింది. 2002లో మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ జరిగిన అల్లర్ల గురించి చెప్పడమే ఈ డాక్యుమెంటరీని ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. బీబీసీపై సర్వే జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ వెలువరించిన రెండు విడతల డాక్యుమెంటరీపై కక్షగట్టే ఐటీ సర్వేపేరుతో తనిఖీలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎడిటర్ గిల్డ్స్, అంతర్జాతీయ మీడియా సైతం ఐటీ సర్వేను తప్పుబట్టాయి. ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. బీబీసీ మాత్రం ఐటీ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపింది.