IT Employees Protest in Hyderabad Over Chandrababu Arrest : స్కిల్ డెవలప్మెంట్ కేసు(Sill Development Case)లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Arrest) అక్రమ అరెస్టుకు నిరసనగా నేడు సాప్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి అరెస్టు చేశారంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ నిరసన(IT Employees Protest) చేపట్టారు. దేశంలో విజన్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబునే అంటూ కొనియాడారు.
'ఐ యామ్ విత్ సీబీఎన్'(I Am With CBN) ప్లకార్డులతో ఉద్యోగులు మానవహారం, ర్యాలీ చేపట్టారు. విప్రో సర్కిల్లో జరిగిన ఈ నిరసనలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. 'సైకో పోవాలి - సైకిల్ రావాలి' అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు నినాదాలు చేశారు. వెంటనే చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు ఉపసంహరించుకోని.. ఆయనను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఆయన జైలు నుంచి విడుదల అయ్యే వరకు తామంతా పోరాడతామని ముక్త కంఠంతో చాటి చెప్పారు. ఈ నిరసనతో విప్రో జంక్షన్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఐ యామ్ విత్ సీబీఎన్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదంటూ ఉద్యోగులను వెనక్కి పంపారు.
IT Employees Protest at Wipro Circle in Hyderabad : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వల్లే ఇప్పుడు తామీస్థాయిలో ఉన్నామని వాపోయారు. ఐటీ ఉద్యోగుల నినాదాలతో హోరెత్తిన విప్రో సర్కిల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరించిన ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. ఆ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఐటీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.
"ఐటీ ఉద్యోగులకు భవిష్యత్తును ఇచ్చిన మనిషి చంద్రబాబు నాయుడు. ఇది కచ్చితంగా ఏపీ ప్రభుత్వం దిగజారుడు చర్యనే. ఆ రోజు ఆయన మా జీవితాల గురించి నిలబడ్డారు..నేడు మా ఐటీ ఉద్యోగులంతా కలిసి ఆయన కోసం నిలబడతాం. ఎవరైనా అరెస్టు అయితే వారి తప్పులు బయటకు వస్తాయి. అదే చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే ఆయన మంచితనం బయటకు వస్తుంది. ఐటీ ఉద్యోగులంతా ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేవరకు పోరాడుతాం." - ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్
TDP Chief Chandrababu Arrest : తమకు జీవితాలను ప్రసాదించిన చంద్రబాబుపై వెంటనే కేసులు ఎత్తివేయాలని ఐటీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైసీపీ నేతలకు అసలు విజన్ అంటే ఏమిటో తెలుసా అంటూ నిలదీశారు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆయనపై అవినీతి మరకలు అంటించేందుకు.. ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నారా చంద్రబాబును అక్రమ కేసులతో అరెస్టు చేసిన జైలులో పెట్టారని ఆవేదన చెందారు. ఏపీలో నాలుగేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని కుండబద్ధలు కొట్టారు.
IT Employees Protest at KPHB : మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కేపీహెచ్బీలో ఐటీ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళననలో వందలాది మంది ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. సైకో పోవాలి-సైకిల్ రావాలంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టీడీపీ అధినేతను విడుదల చేయాలంటూ ఉద్యోగులు భారీ ర్యాలీని చేపట్టారు. కేపీహెచ్బీ నుంచి జేఎన్టీయూ వరకు శాంతియుతంగా ర్యాలీని నిర్వహించారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులను పట్టుకొని.. భారీగా ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు.